పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కొత్త పార్టీ -సిక్కును సిక్కుతోనే అడ్డుకొనేలా బీజేపీ బంపర్ ప్లాన్! -కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?

కెప్టెన్ అమరీందర్ సింగ్

కెప్టెన్ అమరీందర్ బీజేపీలో చేరి, సీఎం అభ్యర్థిగా ఎన్నికలకు వెళ్లాలని భావించినా, సాగు చట్టాలపై రైతు ఉద్యమం నేపథ్యంలో ప్రత్యర్థులను దెబ్బతీయడంపైనే కమలం హైకమాండ్ ఫోకస్ పెట్టడంతో ఆయన కొత్త పార్టీ ఏర్పాటు చేశారు..

  • Share this:
కేంద్ర సర్కారుకు తలనొప్పిలా మారిన రైతుల ఉద్యమంలో తొలి నుంచీ గట్టిగా పోరాడుతున్నది సిక్కులే. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదశ్ లో సాగు చట్టాల వ్యతిరేక ఉద్యమం బలంగా కొనసాగుతుండటంలో సిక్కు రైతులు, సిక్కు రైతు కూలీల పాత్ర విశేషమైంది. మరికొద్ది రోజుల్లో జరుగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక కార్యాచరణ ప్రకటించారు సదరు సిక్కు రైతులు. దీంతో డ్యామేజ్ కంట్రోల్ కోసం బీజేపీ వ్యూహరచన చేయక తప్పలేదు.. సిక్కును సిక్కుతోనే అడ్డుకోవాలనే తరహాలో బీజేపీ.. ఓ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తున్నది. ఆ అస్త్రం పేరే కెప్టెన్ అమరీందర్ సింగ్..

పేరు కంటే గొప్పగా ‘కెప్టెన్ సాబ్’గా దేశమంతటికీ సుపరిచితుడైన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సరికొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు రంగం సిద్ధమైంది. అనేక మలుపులతో సాగిన ఆయన రాజకీయ జీవితంలో కెప్టెన్ కొత్త పార్టీ పెడుతుండటం ఇది రెండోసారి. కాగా, సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగుతోన్న ఉద్యమంలో పార్టీలకు అతీతంగా సిక్కులంతా ఏకమై పోరాడుతోన్న ఈ సందర్భంలో కెప్టెన్ కొత్త పార్టీతో ముందుకు వస్తుండటం సంచలనంగా మారింది..

సోనియా గాంధీకి దగ్గరివాడుగా పేరుపొందిన అమరీందర్ సింగ్ గత నెలలో జరిగిన అనూహ్య పరిణామాల మధ్య పంజాబ్ సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. నవజ్యోత్ సింగ్ సిద్దూకు పంజాబ్ పీసీసీ, చరణజీత్ చన్నీకి ముఖ్యమంత్రి పీఠం అప్పగించడంపై గుర్రుగా ఉన్న కెప్టెన్.. గత నెల 18నే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో వరుస భేటీల తర్వాత సొంత పార్టీ దిశగా కెప్టెన్ అడుగులు వేశారు. ఛండీగఢ్ లో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన రాజకీయ భవిష్యత్తును ప్రకటించారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపుతూ, పంజాబ్ ప్రజల ఆకాంక్షలను తాను మాత్రమే తీర్చగలనని కెప్టెన్ అన్నారు.

అమరీందర్ కొత్త పార్టీ.. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఇప్పటికే ఖరారైంది. అధికారిక ప్రకటనే తరువాయి అన్నట్లుగా కెప్టెన్ సైతం వ్యాఖ్యలు చేశారు. నిజానికి అమరీందర్ బీజేపీలో చేరి, సీఎం అభ్యర్థిగా ఎన్నికలకు వెళ్లాలని భావించినా, రైతు ఉద్యమం నేపథ్యంలో ప్రత్యర్థులను దెబ్బతీయడంపైనే కమలం హైకమాండ్ ఫోకస్ పెట్టడంతో ఆయన కొత్త పార్టీకి రంగం సిద్ధమైంది. సుదీర్ఘకాలం బీజేపీకి మిత్రుడిగా, ఎన్డీఏలో భాగస్వామిగా ఉండిన అకాలీదళ్.. సాగు చట్టాల అంశంలో కేంద్రంతో విభేదించి బయటికి వచ్చేయడం తెలిసిందే. రైతు ఉద్యమంలో కాంగ్రెస్, అకాలీదళ్ ఇద్దరూ కీలక పాత్ర పోషిస్తోన్న దరిమిలా కెప్టెన్ పెట్టబోయే పార్టీ ఎవరిపై ఎలాంటి నెగటివ్ ఎఫెక్ట్ చూపెడుతుందోనని నేతలు తలు పట్టుకున్నారు..

1980లో రాజీవ్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన అమరీందర్.. 84లో ఇందిరా గాంధీ హత్య అనంతరం సిక్కుల ఊచకోతతో ఆ పార్టీని వీడి అకాలీదళ్ లో చేరారు. అకాలీ తరఫున రాష్ట్రమంత్రిగానూ పనిచేసి,  బాదల్ ఫ్యామిలీతో విభేదాలు రావడంతో శిరోమణి అకాలీదళ్ (పంథిక్) పేరుతో కొత్త పార్టీని పెట్టుకున్నారు. 1998లో మళ్లీ కాంగ్రెస్ కు దగ్గరైన కెప్టెన్ తన పార్టీని వీలనం చేశారు. తిరిగి ఇన్నేళ్లకు రెండోసారి కొత్త పార్టీని ప్రకటించారాయన. అమరీందర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన ద్వారా లబ్ది పొందిన ఏ కొందరో తప్ప కాంగ్రెస్ నేతలెవరూ అటువైపు వెళ్లబోరని సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ అన్నారు.
Published by:Madhu Kota
First published: