Telangana TDP President: తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు.. ప్ర‌క‌టించిన చంద్రబాబు నాయుడు

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడిగా మాజీ ఎమ్మెల్యే బ‌క్క‌ని నర్సింహులు నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు నిర్ణ‌యం తీసుక‌న్నారు.

  • Share this:
    తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడిగా మాజీ ఎమ్మెల్యే బ‌క్క‌ని నర్సింహులు నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు నిర్ణ‌యం తీసుక‌న్నారు. తెలంగాణ టీడీపీ చీఫ్‌గా ఉన్న ఎల్ ర‌మ‌ణ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరిన సంగ‌తి తెలిసిందే. దీంతో టీటీడీపీ కొత్త అధ్య‌క్షుడిగా బ‌క్క‌ని న‌ర్సింహుల‌ను నియ‌మిస్తున్న‌ట్టుగా.. చంద్ర‌బాబు నాయుడు పేరుతో ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గానికి చెందిన నర్సింహులు గ‌తంలో షాద్‌న‌గ‌ర్‌ ఎమ్మెల్యేగా, టీటీడీ బోర్డు సభ్యునిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. చాలా కాలంగా ఆయ‌న పార్టీకి విధేయుడిగా ఉంటూ వ‌స్తున్నారు.

    తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించినందుకు చంద్రబాబుకు బక్కని నర్సింహులు కృతజ్ఞతలు తెలిపారు. టీటీపీ అధ్యక్షుడిగా ఎంపికైన‌ సందర్భంగా బక్కని నర్సింహులు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో నర్సింహులను అభినందించిన లోకేష్.. సమస్యల పరిష్కారం కోసం ప్రజల పక్షాన పోరాటం చేయాలని చెప్పారు.



    ఇక‌, ఎల్ ర‌మ‌ణ టీడీపీకి రాజీనామా చేయ‌డంతో.. పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు టీటీడీపీకి కొత్త అధ్య‌క్షుడిని ఎంపిక చేసేంద‌కు ఈ ప్రాంత‌ టీడీపీ నేత‌ల‌తో మంత‌నాలు జ‌రిపారు. ప‌లుమార్లు వారితో స‌మావేశం అయి చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ క్ర‌మంలోనే టీటీడీపీ కొత్త అధ్య‌క్షుడిగా అర‌వింద్ గౌడ్‌, రావుల చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి పేర్లు వినిపించాయి. అయితే వ్యక్తిగత కారణాల దృష్ట్యా రావుల చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి బాధ్య‌తలు తీసుకోవ‌డానికి ఆసక్తి చూపలేదు. తాజాగా బక్కని నర్సింహులు టీటీడీపీ అధ్య‌క్షుడిగా నియ‌మిస్తూ చంద్ర‌బాబు నాయుడు నిర్ణ‌యం తీసుకున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published: