Home /News /politics /

FLEXI WAR BETWEEN JANASENA AND TDP IN VIJAYAWADA

టీడీపీ వర్సెస్ జనసేన...బెజవాడలో ఫ్లెక్సీల రగడ

చంద్రబాబు, పవన్ కళ్యాణ్

చంద్రబాబు, పవన్ కళ్యాణ్

విజయవాడలో కొత్త రకం రాజకీయం నడుస్తోంది. ఫ్లెక్సీల పేరుతో నేతలు కుస్తీలు పడుతున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇది కాస్త వివాదంగా మారడంతో పోలీసులు అలర్టయ్యారు.

    విజయవాడలో టీడీపీ, జనసేన మధ్య ఫ్లెక్సీల రగడ మొదలైంది. పోటాపోటీగా ఇరు పార్టీల నేతలు ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు రాజకీయంగా కలకలం సృష్టిస్తున్నాయి.ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను విమర్శిస్తూ టీడీపీ నేత కాట్రగడ్డ బాబు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు పోటీగా... జనసేన నాయకుడు మండలి రాజేశ్ టీడీపీని విమర్శలు చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సంచలనం సృష్టించింది.

    2009లో టీడీపీ పరిస్థితి ఏమిటి? 2014లో ఎవరి అండతో టీడీపీ అధికారంలోకి వచ్చిందో తెలుగు తమ్ముళ్లు తెలుసుకోవాలంటూ జనసేన నేతలు ఫ్లెక్సీలో పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి రావడానికి సహకరించిన పవన్ కల్యాణ్ ను విమర్శించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. సీఎం చంద్రబాబు జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించడాన్ని తప్పుబడుతూ కాట్రగడ్డ బాబు ఇటీవల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీనికి కౌంటర్ గా జనసేన నేతలు తాజాగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం రాజకీయంగా అలజడి రేపింది.

    ఈ ఫ్లెక్సీల అంశం బెజవాడ రాజకీయాల్లో కాకరేపుతోంది. ఇరు పార్టీల నేతలు వరుసగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండటంతో పోలీసులు దీనిపై దృష్టి సారించారు. ఫ్లెక్సీ రగడపై నగర కమిషనర్ ద్వారకా తిరుమలరావు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫ్లెక్సీల్లో వ్యక్తిగత దూషణను తీవ్రంగా పరిగణించిన పోలీసులు.. పరిస్థితులు చేయిదాటకుండా రెండు పార్టీల నేతలను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ఫ్లెక్సీ వార్‌ను ఇంతటితో ఆపేయాలని నేతలకు చెప్పనున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Chandrababu naidu, Janasena party, Pawan kalyan, Tdp, Vijayawada

    తదుపరి వార్తలు