హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ రికార్డ్ గెలుపు... ఐదు కారణాలు

హుజూర్ నగర్‌లో టీఆర్ఎస్ సాధించిన విజయంలో ఎవరి పాత్ర ఏమిటనే అంశం హాట్ టాపిక్‌గా మారింది.

news18-telugu
Updated: October 24, 2019, 3:28 PM IST
హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ రికార్డ్ గెలుపు... ఐదు కారణాలు
టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు
  • Share this:
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి 43,233 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిరెడ్డిపై విజయం సాధించారు. హుజూర్ నగర్‌లో చరిత్రలోనే ఈ స్థాయిలో రికార్డ్ మెజార్టీతో గెలిచిన సైదిరెడ్డి... రాష్ట్రంలో టీఆర్ఎస్ హవా ఏ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించారు. నిజానికి హుజూర్ నగర్‌లో టీఆర్ఎస్ ఈ రేంజ్ మెజార్టీతో గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. గెలిచినా... మెజార్టీ 10 లేదా 15 వేలు దాటకపోవచ్చని లెక్కలు వేసుకున్నారు. కానీ, టీఆర్ఎస్ అందరి అంచనాలను తారుమారు చేసింది. రికార్డ్ స్థాయిలో మెజార్టీ సాధించి... మున్సిపల్ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్‌కు పెద్ద బూస్టింగ్ ఇచ్చింది. దీంతో అసలు హుజూర్ నగర్‌లో టీఆర్ఎస్ సాధించిన విజయంలో ఎవరి పాత్ర ఏమిటనే అంశం హాట్ టాపిక్‌గా మారింది.

సైదిరెడ్డి: టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచిన సైదిరెడ్డి పార్టీ గెలుపుకు ప్రధాన కారణమని చెప్పొచ్చు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలిచి హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పుడే... తాను ఇక్కడి నుంచి మరోసారి పోటీ చేయాల్సి ఉంటుందని ఫిక్స్ అయ్యారు సైది. అప్పటికే నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్న సైదిరెడ్డి... స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. అలా నియోజకవర్గంలో పరిచయాలను పెంచుకుని తన విజయానికి తానే స్వయంగా బాటలు వేసుకున్నారు.

జగదీష్ రెడ్డి: హుజూర్ నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపు కోసం పక్కా వ్యూహరచన చేశారు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి. గతంలో ఇక్కడ పోటీ చేసిన అనుభవం ఉండటం జగదీష్ రెడ్డికి బాగా కలిసొచ్చింది. మంత్రిగా ఉండటంతో నియోజకవర్గంలోని అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు అందులో సైదిరెడ్డిని భాగస్వామిని చేశారు జగదీష్ రెడ్డి.

పల్లా రాజేశ్వర్ రెడ్డి: హుజూర్ నగర్‌ ఉప ఎన్నిక ఇంఛార్జ్ బాధ్యతలను సీఎం కేసీఆర్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి అప్పగించారు. పోల్ మేనేజ్ మెంట్‌లో మంచి దిట్టగా పేరున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి.... పార్టీ శ్రేణులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ టీఆర్ఎస్ గెలుపులో కీలక భూమిక పోషించారు.కేటీఆర్: తాను వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తరువాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఉప ఎన్నిక కావడంతో... ఈ ఎన్నికను కేటీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నియోజకవర్గంలో కేటీఆర్ ప్రచారం నిర్వహించింది తక్కువే అయినా... క్షేత్రస్థాయిలో పని చేస్తున్న నేతలను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు కేటీఆర్. ఎన్నికలు పూర్తయిన వెంటనే మంచి మెజార్టీతో తాము గెలవబోతున్నామని కేటీఆర్ ప్రకటించుకున్నారంటేనే... ఆయన ఈ ఉప ఎన్నికపై ఎంతగా దృష్టి పెట్టారో అర్థం చేసుకోవచ్చు.

సంక్షేమ పథకాలు: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు హుజూర్ నగర్ నియోజకవర్గంలో పక్కాగా అమలు చేయడం కూడా ఇక్కడ ఆ పార్టీ విజయానికి మరో కారణంగా చెప్పవచ్చు. రైతు బంధుతో పాటు పెన్షన్ల వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం కూడా టీఆర్ఎస్ గెలుపుకు మరో కారణం. ఇలా అనేక అంశాలు ప్రభావితం చేయడంతో... నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ ప్రచారం చేయకపోయినా టీఆర్ఎస్ భారీ మెజార్టీతో విజయం సాధించింది.
First published: October 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>