ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల సీజన్ ముగిసింది. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల హడావిడి నడుస్తోంది. పట్టణాల్లో ప్రచారం ఊపందుకుంది. ఓ వైపు ప్రచారం.. మరోవైపు ఖర్చులు వెరసి అభ్యర్థులకు తడిమోపెడవుతోంది. గత ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఆయా పార్టీల తరపున నేతలు నామినేషన్లు వేశారు. ఉత్సాహంగా ప్రచారంలోకి దిగారు. కట్ చేస్తే కరోనా వచ్చి ఎన్నికలను వాయిదా వేసింది. ఐతే ఎనీటైమ్ ఎన్నికలు వస్తాయన్న ఆలోచనతో ఉన్న అభ్యర్థులు ఇదే సరైన సమయం అనుకొని తమ పరిధిలోని ప్రజలకు నిత్యావసరాలు, కూరగాయలు పంచిపెట్టారు. ఆ ఖర్చంతా ఎన్నికల్లో కలిసొస్తుందని భావించారు. కానీ ఎన్నికల ప్రక్రియ ఏకంగా ఏడాది వాయిదా పడింది. దీంతో వారు చేసిన ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరైంది. అదే షెడ్యూల్ ను కొనసాగిస్తున్నట్లు ఎస్ఈసీ ప్రకటించడంతో అభ్యర్ధులంతా షాక్ కు గురయ్యారు.
ఎన్నికలెప్పుడొస్తాయన్న టెన్షన్ కు ముగింపు పలికినా.. ఖర్చుల విషయంలో మాత్రం నెత్తిన పిడుగుపడిందనే చెప్పాలి. ఎన్నికల కోసం కూడబెట్టినది.. దగ్గరివారిని అడిగి తెచ్చిన డబ్బంతా ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేయడానికి, అక్కడక్కడా అన్నదాన శిబిరాలు ఏర్పాటుకే ఖర్చయిపోయింది. ఇప్పుడు ప్రచారం కోసం సొంతగా ఖర్చు చేసేవారే కరువయ్యారు. ఉదాహరణకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ విషయానికి వస్తే.. కరోనా లాక్ డౌన్ సమయంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన కార్పొరేటర్ అభ్యర్థులు ప్రజలకు పోటీ పడి మరీ కూరగాయలు, నిత్యావసరాలు, శానిటైజర్లు, మాస్కులు ఇలా ఒకటేమిటీ పనికొస్తాయనుకున్నవన్నీ పంపిణీ చేశారు. ప్రస్తుతం ప్రచారానికి ఖర్చు చేయాలంటే వెనుకాడాల్సిన పరిస్థితి. మేయర్ అభ్యర్థులు లేదా పార్టీ అధిష్టానం ఏమైనా సర్దుబాటు చేస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.
కార్పొరేషన్ బరిలో ఉన్న అభ్యర్థుల వ్యయపరిమితి ఎప్పుడో దాటిపోయింది. ఒక్కో డివిజన్ కు రూ.2లక్షలకు మించి ఖర్చు చేయడానికి వీల్లేదు. ఐతే నామినేషన్ల సమయంలో ఊరేగింపులకు, ఆ తర్వాత ప్రచారానికి బాగానే ఖర్చైపోయింది. ఈ లెక్కన ఎస్ఈసీ నిర్ణయించిన పరిమితి ఎప్పుడో దాటిపోయి ఉంటుంది. ఇప్పుడు మేయర్ అభ్యర్థులే కార్పొరేటర్ అభ్యర్థులకు ఫైనాన్షియర్లుగా మారిపోయారు. విజయవాడ మేయర్ పదవిని ఆశిస్తున్న ఓ నేత.. కార్పొరేటర్ అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ.10లక్షల చొప్పున ఇస్తానని హామీ ఇచ్చినట్లు తేలుస్తోంది. ఈ లెక్కన విజయవాడలోని అన్ని డివిజన్లకు కలిపి ఏకంగా రూ.6 కోట్ల వరకు ఖర్చవుతోంది. అలాగే మున్సిపాలిటీల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. ఎన్నికల ప్రక్రియకు ఏడాది బ్రేక్ రావడంతో గత ఏడాది అప్పులు చేసి ప్రచారాలు నిర్వహించిన కొందరు అభ్యర్థులు ఇంకా వాటిని చెల్లించనేలేదు. తాజా ప్రచారానికి సంబంధించి రోడుకు రూ.10వేల వరకు ఖర్చవుతున్న నేపథ్యంలో అభ్యర్థులకు ఆర్ధిక కష్టాలు తప్పడం లేదు.
Published by:Purna Chandra
First published:February 23, 2021, 16:39 IST