ఫెడరల్ ఫ్రంట్ కోసం డీఎంకే అధినేత స్టాలిన్‌ను కలిసేందుకు చెన్నై వెళ్లిన సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ రోజు ఉదయం శ్రీరంగంలో పర్యటించారు. అక్కడి రంగనాథస్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి వారి ఆశీర్వచనం, తీర్థం అందజేశారు. అనంతరం వేదమంత్రాల నడుమ పూలమాలను కేసీఆర్ మెడలో వేశారు. కాగా, ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు డీఎంకే అధినేత స్టాలిన్‌తో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. తమిళనాడు పర్యటన నిమిత్తం ఆదివారం సాయంత్రమే కేసీఆర్ ప్రత్యేక విమానంలో చెన్నైకు చేరుకున్నారు. ఆయన వెంట పలువురు టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా మద్దతు కూడగట్టడం కోసం కేసీఆర్ స్టాలిన్‌ని కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకుగాను ఐదు రోజుల తన పర్యటనలో ఇందుకు ముహూర్తం సైతం కుదిరింది. అయితే, వీరి భేటీ రద్దైనట్లు వార్తలొచ్చాయి. కానీ, చివరికి ఆ ఉత్కంఠకు తెరపడింది.
బీజేపీ, కాంగ్రెస్ యేతర పార్టీలు కేంద్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్రాలు బాగుపడతాయని గత కొంత కాలంగా కేసీఆర్ చెబుతూ వస్తున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో సైతం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌నే ఎన్నికల ప్రధాన అస్త్రంగా మలుచుకున్నారు. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తి అయిన నేపథ్యంలో ఎన్నికల సరళి, పోలింగ్ విధానం, సర్వేలపై ఆరా తీసిన కేసీఆర్.. కాంగ్రెస్, బీజేపీలకు పూర్తి స్థాయి మెజారిటీ రాదని ఏ ఒక్క పార్టీ కూడా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోదన్న ధీమాతోనే ఆయన ఫ్రంట్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అంతేకాదు, ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ఇతర వివిధ రాష్ట్రాల్లో పర్యటించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ముందుగా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఫ్రంట్ ఏర్పాటుపై తమతో కలిసి రావటానికి సిద్ధంగా ఉన్న ప్రాంతీయ పార్టీల నేతలతో సీఎం కేసీఆర్ భేటీ అవుతారని స్పష్టం చేస్తున్నాయి.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.