ఢిల్లీ శివారులో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది అన్నదాతలు ఆందోళనల్లో పాల్గొంటున్నారు. కేంద్రంతో పలు దఫాల చర్చలు జరిపినప్పటికీ కొలిక్కి కాలేదు. ఐతే రైతుల ఆందోళనలు సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్లాయని బీజేపీ నేతలు అనడాన్ని.. రైతులు తప్పుబట్టుతున్నారు. రైతు ఉద్యమాన్ని అవమానపరిచారంటూ బీజేపీ నేతలకు పలువురు రైతులు లీగల్ నోటీసులు పంపించారు. కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్, గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, మరో బీజేపీ నేత రామ్ మాధవ్‌కు నోటీసులు పంపించారు. తమకు వెంటనే క్షమాపణలు చెప్పాలని.. రైతుల ఆందోళనలపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రైతుల ఆందోళనల్లో ఉగ్రవాదులు, ఖలిస్తానీలు, కమ్యూనిస్టులు, చైనా అనుకూల శక్తులు చొరబడ్డాయని వ్యాఖ్యలు చేస్తూ.. తమను అవమాన పరుస్తున్నారని పంజాబ్‌కు చెందిన రైతులు మండపడుతున్నారు. రైతులు పిజ్జాలు, పకోడీలు తినకూడదా? అని ప్రశ్నించారు.
డిసెంబరు 30న జరిగిన చర్చల్లో కొంత పురోగతి కనిపించింది. విద్యుత్తు సవరణ చట్టం ముసాయిదా బిల్లులో అభ్యంతరాలు, ఢిల్లీ వాయుకాలుష్యంపై జారీ చేసిన ఆర్డినెన్సులో పేర్కొన్న జరిమానాలు, శిక్షల నుంచి రైతులను మినహాయించడం, కొత్తగా తెచ్చిన మూడు రైతు చట్టాల రద్దు, కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించడం అనే నాలుగు అంశాలపై ప్రభుత్వంతో రైతులు చర్చలు జరిపారు. ఐతే మొదటి రెండు అంశాలపై పరిష్కరిస్తామని రైతులకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. కొత్త వ్యవసాయ చట్టాల రద్దు, ఎమ్మెస్పీకి చట్టబద్ధత కల్పించే అంశాలపై జనవరి 4న మరో దఫా చర్చించనున్నారు.
రెండు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందన్న వ్యవసాయ మంత్రి తోమర్ ప్రకటనను రైతు సంఘాల నేతలు మాత్రం తప్పుబట్టారు. ఆరవ విడత చర్చల్లో కేంద్ర ప్రభుత్వంతో రైతు సంఘాలకు ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదని స్పష్టం చేశారు. ముందు జరిగిన ఐదు సమావేశాల్లాదే ఇదీ ముగిసిందని స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. జనవరి 4న జరిగే చర్చల్లో పరిష్కారం లభించకపోతే.. పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని రైతులు స్పష్టం చేశారు. జనవరి 5 నుంచి పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్ తెరవనీయమని స్పష్టం చేశారు. జనవరి 6న ఢిల్లీలో ట్రాక్టర్ల ర్యాలీని నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కొత్త చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.