news18-telugu
Updated: May 20, 2019, 8:46 AM IST
ప్రతీకాత్మక చిత్రం
ఆదివారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలు తెలంగాణలో టీఆర్ఎస్కే మెజారిటీ సీట్లు ఖాయమని తేల్చేశాయి. అయితే టీఆర్ఎస్ చెబుతున్నట్టుగా 16 స్థానాలు కాకుండా 14 లేదా 15 స్థానాలు గెలుచుకోవచ్చునని చాలా వరకు సర్వేలు అంచనా వేశాయి. అదే సమయంలో తెలంగాణలో బీజేపీ ఒక లోక్సభ స్థానంలో విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. దీంతో బీజేపీ గెలవబోయే ఆ ఒక్క సీటు ఏదన్నది ఆసక్తికరంగా మారింది.
లోక్సభ ఎన్నికల బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థులను పరిశీలిస్తే.. సికింద్రాబాద్ నుంచి పోటీ చేసిన కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి పోటీ చేసిన బండి సంజయ్ మాత్రమే ఆ పార్టీ తరుపున బలమైన అభ్యర్థులు అన్న వాదన ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ బీజేపీ తెలంగాణలో ఒక సీటును గెలుచుకునే అవకాశం ఉంటే.. అది ఈ రెండింటిలోనే ఉండి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ టీఆర్ఎస్ 14కే పరిమితమైతే బీజేపీ ఈ రెండు స్థానాల్లోనూ సత్తా చాటే అవకాశం లేకపోలేదంటున్నారు.
మరోవైపు టీఆర్ఎస్ మాత్రం తాము 16/16 స్థానాలు సాధించడం ఖాయమని ధీమాగా చెబుతోంది. 'సారు.. కారు.. పదహారు' నినాదం నిజమవుతుందని చెబుతోంది. దీంతో మే 23న వెలువడే ఫలితాల్లో ఎగ్జిట్ పోల్ అంచనాలే నిజమవుతాయా? లేక టీఆర్ఎస్ చెబుతున్నట్టుగా 16 స్థానాలు వారే గెలుచుకుంటారా? అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
First published:
May 20, 2019, 8:46 AM IST