చంద్రబాబు, కేసీఆర్ కింగ్ మేకర్ కలలు చెదిరిపోయాయా ?

కేంద్రంలో మరోసారి మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేయడంతో... కేసీఆర్, చంద్రబాబునాయుడు కలలు చెదిరిపోయాయనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

news18-telugu
Updated: May 21, 2019, 10:39 AM IST
చంద్రబాబు, కేసీఆర్ కింగ్ మేకర్ కలలు చెదిరిపోయాయా ?
కేసీఆర్,చంద్రబాబు
  • Share this:
రాజకీయాల్లో ఎవరైనా కింగ్ కావాలని అనుకుంటారు. ఈ సంకీర్ణ యుగంలో కింగ్ లేదా కింగ్ మేకర్ అయ్యేందుకు నేతలు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఈ ఎన్నికల తరువాత జాతీయ స్థాయిలో తాము కింగ్ మేకర్లుగా మారతామని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ బలంగా నమ్మారు. కాంగ్రెస్ సారథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అందులో కీలక పాత్ర పోషించాలని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తే... ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి అందులో కీలక పాత్ర పోషించాలని తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్లాన్ చేశారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల తరువాత కూడా ఈ ఇద్దరు నేతలు తమ లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు ప్రయత్నాలు చేశారు.

అయితే కేంద్రంలో మరోసారి మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేయడంతో... ఇద్దరు చంద్రుల కల చెదిరిపోయిందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. తెలంగాణలో గత ఎన్నికల్లో 11 సీట్లు గెలుచుకుని కూడా కేంద్రంలో ఏమీ చేయలేకపోయిన కేసీఆర్... ఈ సారి అంతే సంఖ్యలో సీట్లు వచ్చినా కేంద్రంలో చక్రం తిప్పొచ్చని అంచనా వేశారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని ఇతర ప్రాంతయ పార్టీల నేతలతో చర్చలు కూడా జరిపారు. కానీ కేసీఆర్ ప్రయత్నాలు అంతగా ఫలించలేదు. దీనికి తోడు ఎగ్జిట్ పోల్స్ మరోసారి మోదీ అధికారంలోకి రావడం ఖాయమనే సంకేతాలు ఇవ్వడంతో కేసీఆర్ కల చెదిరినట్టే అనే ఊహాగానాలు మొదలయ్యాయి.

అయితే ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఇంకా తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఎన్డీయేకు పూర్తిస్థాయి మెజార్టీ రాదనే గట్టి నమ్మకంతో ఉన్న చంద్రబాబు... ముందుగానే యూపీఏ పక్షాలు, తటస్థ పార్టీలు ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు తనవంతుగా కృషి చేస్తున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ నిజమైతే... చంద్రబాబు ప్రయత్నాలన్నీ వృధా కావడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి కేంద్రంలో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్, చంద్రబాబునాయుడు కల ఏ మేరకు నెరవేరుతుందో తెలియాలంటే మే 23వరకు వెయిట్ చేయాల్సిందే.

First published: May 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...