EXIT POLL RESULTS 2019 WILL EC TAKE ACTION AGAINST LAGADAPATI RAJAGOPAL OVER EXIT POLLS SK
లగడపాటిపై ఈసీ చర్యలు? ముందేకూసి రీపోలింగ్‌ను ప్రభావితం చేశారా?
మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్
ఏపీలో రీపోలింగ్ జరుగుతోందని తెలిసి కూడా ఎగ్జిట్ పోల్ వివరాలను ఎలా వెల్లడిస్తారని విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో లగడపాటి తీరుపై ఈసీకి ఫిర్యాదు చేసేయోచనలో ఉన్నారు వైసీపీ నేతలు.
Exit Poll Results 2019: దేశంలో ఎన్నికల రాజకీయం క్లైమాక్స్‌కు చేరింది. ఇవాళ ఆఖరి దశ ఎన్నికలు జరుతున్న నేపథ్యంలో అందరి కళ్లూ ఎగ్జిట్ పోల్స్‌పైనే పడ్డాయి. సాయంత్రం 6 గంటల నుంచే పలు మీడియా సంస్థలు, సర్వే సంస్థలు తమ ఫలితాలను ప్రకటించబోతున్నాయి. పోలింగ్ రోజున ప్రజల నాడి ఎలా ఉందో బయటపెట్టబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరున్న లగడపాటి రాజగోపాల్ సర్వేపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఐతే ఎగ్జిట్ పోల్స్‌పై శనివారమే ఆయన ట్రైలర్ వదిలారు. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయన్న పూర్తి వివరాలు చెప్పకున్నా.. ఎవరు గెలవబోతున్నారన్నది క్లారిటీగా చెప్పేశారు.
ఏపీలో ప్రజలు సైకిల్ ఎక్కేందుకే మొగ్గుచూపారన్న లగడపాటి..టీడీపీ గెలుస్తుందని చెప్పకనే చెప్పారు. తెలంగాణలో కారుదే జోరని చెప్పి.. తెలంగాణ లోసభ ఎన్నికల్లో టీఆర్ఎస్కే మెజార్టీ సీట్లు రాబోతున్నాయని అంచనా వేశారు. పవన్ కల్యాణ్ అసెంబ్లీలోకి పెట్టబోతున్నారని జోస్యం చెప్పారు లగడపాటి. ఐతే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యంపార్టీకి వచ్చిన సీట్ల కంటే జనసేనకు తక్కువ సీట్లే వస్తాయని లగడపాటి వెల్లడించారు. ఆఖరి దశ ఎన్నికలకు కొన్ని గంటల ముందు ప్రెస్‌మీట్ పెట్టిమరీ ఈ అంశాలను మీడియాకు తెలిపారు.
ఐతే ఎన్నికల నిబంధనల ప్రకారం మే 19 సాయంత్రం 6 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం ఉంది. కానీ లగడపాటి మాత్ర వాటిని తుంగలోకి తొక్కి ఎన్నికల సర్వేను బయటపెట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీట్లు వివరాలు, పార్టీ పేర్లు చెప్పనప్పటికీ...ఏ పార్టీకి అధికారం దక్కబోతోందో చెప్పారు. ఇది కూడా ఎగ్జిట్ పోల్స్ కిందకే వస్తుందన్నది నిపుణుల అభిప్రాయం. అంతేకాదు ఆదివారం చంద్రగిరిలోని 7 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ జరుగుతోంది. లగడపాటి ఫలితాలు ఆయా ప్రాంతాల్లోని ఓటర్లను ప్రభావితం చేసే అవకాశముందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే వైసీపీ నేతలు లగడపాటి రాజగోపాల్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆయన ఆంధ్రా ఆక్టోపస్ కాదని...ఎల్లో జలగంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీలో రీపోలింగ్ జరుగుతోందని తెలిసి కూడా ఎగ్జిట్ పోల్ వివరాలను ఎలా వెల్లడిస్తారని విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో లగడపాటి తీరుపై ఈసీకి ఫిర్యాదు చేసేయోచనలో ఉన్నారు వైసీపీ నేతలు. మరి ఏవైనా ఫిర్యాదులు అందితే.. లగడపాటి రాజగోపాల్‌పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందా? లేదా? అన్న చర్చ తెలుగురాష్ట్రాల్లో జరుగుతోంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.