ఎన్నికల ఫలితాలపై సర్వేలు నిర్వహిస్తూ.. ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరు సంపాదించుకున్నారు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. ఆయన ఇప్పటి వరకు ప్రకటించిన చాలా ఎన్నికల ఫలితాలు దాదాపు నిజం కావడంతో ఆయనకా పేరు స్థిరపడిపోయింది. అయితే, ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆయన జోస్యం ఫలించలేదు. ఆయన సర్వే ఫలితాలకు, ఆ తర్వాత వచ్చిన ఎన్నికల ఫలితాలకు ఏమాత్రం పొంతన లేకుండా పోవడంతో.. లగడపాటి సర్వే కూడా ఉత్తిదేనన్న భావన జనాల్లో పడిపోయింది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న లగడపాటి.. మరోసారి మీడియా ముందుకు వచ్చారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై తొలిసారి పెదవి విప్పారు. సర్వే ఫలితాలపై తన లెక్క తప్పిందని అంగీకరించారు. అయితే, అందుకు చాలా కారణాలను, అనుమానాలను వ్యక్తం చేశారు లగడపాటి.
తెలంగాణ ఎన్నికల్లో ధన ప్రవాహం పెరిగిపోయిందని, అందుకే ఎన్నికల నాటికి ప్రజల అభిప్రాయం మారిపోయిందని చెప్పారు. తాను నమ్మిన విషయాలే ప్రజలతో పంచుకున్నాను తప్ప.. ఎవరి ప్రోద్బలంతోనో పనిచేసే వాడిని కాదన్నారు. తెలంగాణ ఎన్నికలపై పలు అనుమానాలు ఉన్నాయని చాలామంది ఆరోపిస్తున్నారని, ఎలక్ట్రానిక్ యుగంలో ఉంటూ పోలింగ్ శాతం చెప్పేందుకు ఈసీకి రెండు రోజులు ఎందుకు పట్టిందో అర్థం కావడం లేదని లగడపాటి అన్నారు. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి వీవీ ప్యాట్‌లు లెక్కిస్తే అనుమానాలు నివృతి అవుతాయని లగడపాటి అన్నారు.
2003 నుంచి అనేక ఎన్నికల్లో సర్వేలు నిర్వహించానని, ఎక్కడా తేడా రాలేదని.. తొలిసారిగా లెక్క తప్పిందని లగడపాటి చెప్పారు. అలాగని, సర్వేలు చేయడం ఆపబోనని, రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపైనా సర్వేలు నిర్వహిస్తానని స్పష్టం చేశారు. అయితే, సర్వే ఫలితాలను మాత్రం ఎన్నికలయ్యాకే వెల్లడిస్తానని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు, పంచాయితీ ఎన్నికలకు చాలా తేడా ఉందని.. తెలంగాణలో ప్రతిపక్షం బాగా పుంజుకుందని, సర్పంచ్ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు పడుతున్న ఓట్లు చూస్తే ఆ విషయం అర్థమవుతుందని లగడపాటి చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Lagadapati, Telangana, Telangana Election 2018, Telangana News, Vijayawada