EX MP KONDA VISHVESHWAR REDDY TALKS WITH ETELA RAJENDAR MAINTAINING RELATIONS WITH REVANTH REDDY AK
Telangana: రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ మధ్యలో మాజీ ఎంపీ.. అసలేం జరుగుతోంది ?
ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)
Konda Vishweshwar Reddy: ఈటల రాజేందర్‌ను రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ వైపు తీసుకొచ్చేందుకు విశ్వేశ్వర్ రెడ్డి ప్రయత్నించారనే వార్తలు వచ్చాయి. కానీ ఈటల మాత్రం బీజేపీలో చేరేందుకు మొగ్గుచూపారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక రాజకీయం రసవత్తరంగా మారుతోంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీమంత్రి ఈటల రాజేందర్.. బీజేపీలో చేరిన తరువాత ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడి నుంచి మళ్లీ గెలిచేందుకు అప్పుడే పాదయాత్ర కూడా మొదలుపెట్టారు. టీఆర్ఎస్పై ఘాటుగా విమర్శలు గుప్పిస్తూ ముందుకు సాగుతున్నారు. మరోవైపు ఈటలను గెలిపించుకోవడం ద్వారా రాష్ట్రంలో బీజేపీ బలోపేతం అవుతుందని ఆ పార్టీ నాయకత్వం కూడా భావిస్తోంది. మరోవైపు ఈటల బీజేపీలో చేరడానికి ముందు ఆయనతో చర్చలు జరిపిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. ఇటీవల మళ్లీ కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి తనను కలిసిన సందర్భంగా మళ్లీ కాంగ్రెస్‌లో చేరడానికి ఆయన సిద్దమయ్యారు. అయితే ఉన్నట్టుండి ఆయన బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో కలిసి హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. ఈ రకంగా బీజేపీ నేతతో కలిసి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న ఈటల రాజేందర్‌ను కలవడంపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజానికి ఈటల రాజేందర్‌ను రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ వైపు తీసుకొచ్చేందుకు విశ్వేశ్వర్ రెడ్డి ప్రయత్నించారనే వార్తలు వచ్చాయి. కానీ ఈటల మాత్రం బీజేపీలో చేరేందుకు మొగ్గుచూపారు.
ఈ నేపథ్యంలో బీజేపీలో చేరిన ఈటలను కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎందుకు కలిశారనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ వైపు రావాలనుకుంటే బీజేపీ అభ్యర్థికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. కానీ బీజేపీ ముఖ్యనేత జితేందర్ రెడ్డితో కలిసి ఈటలతో చర్చలు జరపడం వెనుక కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్లాన్ ఏంటన్నది ఎవరికీ అర్థంకావడం లేదు. మొత్తానికి రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతారన్న అంశం ఆసక్తికరంగా మారింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.