ఆంధ్రప్రదేశ్ అనంతపురం టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తరచు తన కామెంట్స్ తో వార్తల్లో నిలిచే జేసీ.. ఇప్పుడు రాజధాని అమరావతి ఉద్యమంపై హాట్ కామెంట్స్ చేశారు. కొందరు వృద్ధనేతలు ప్రజలను రెచ్చగొట్టడం తప్ప సాధించిందేమీ లేదన్నారు. అమరావతి కోసం ఆమరణ దీక్ష చేయడం తప్ప మరోదారి లేదని స్పష్టం చేశారు. 70ఏళ్లు పైబడిన నేతలంతా ఏంచేస్తున్నారని ప్రశ్నించిన ఆయన.. వృద్ధ నాయకులంతా తమ ప్రసంగాలతో అమరావతి ప్రజలను రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు చేసిన ఉద్యమానికి ఏమైనా స్పందన ఉందా.. స్పందన రాని ఉద్యమం ఎందుకని ప్రశ్నించారు. ఇలా చేస్తే ప్రభుత్వం స్పందించదని..ప్రాణత్యాగానికైనా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అక్కడి ప్రజలు కోరితే నేను అమరావతి కోసం ఆమరణ దీక్ష చేస్తానన్నారు.
ఈనెల 4 నుంచి ఆమరణదీక్ష
పార్టీలకు అతీతంగా వృద్ధనాయకులంతా మాటలు కట్టిబెట్టి ఉద్యమంలో చురుగ్గా పాల్గొనాలన్నారు. అమరావతి కోసం తాడిపత్రిలో నేను, నా తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ నెల 4వ తేదీ నంచి దీక్ష చేస్తామని ప్రకటించారు. తాను ఉద్యమానికి దిగితే ఎట్టిపరిస్థితుల్లోనే వెనకడుగు వేసే ప్రసక్తే లేదని జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. 144 సెక్షన్, సెక్షన్ 30 యాక్ట్, కోవిడ్ యాక్ట్ అమల్లో ఉన్నా దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. అరెస్టులు చేస్తారెమో చేసుకోండంటూ ప్రభుత్వానికి, పోలీసులకు సవాల్ విసిరారాయన. తనతో పాటు 70ఏళ్లు దాటిన నేతలంతా కలిసిరావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కేసులను రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారని.. ఆ పద్ధతికి వ్యతిరేకంగానే ఉద్యమం చేస్తున్నట్లు జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు.
రాజకీయ వర్గాల్లో చర్చ
జేసీ దివాకర్ రెడ్డి జేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. 70ఏళ్లు దాటిన నేతలంటూ పరోక్షంగా టీడీపీ అధ్యక్షడు చంద్రబాబునాయుడ్ని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారంటున్నారు. లేకుంటే చంద్రబాబే ఆమరణ దీక్ష చేయాలని పరోక్షంగా డిమాండ్ చేసినట్లు చర్చించుకుంటున్నారు. జేసీ ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. తన వ్యాపారాలు, మైనింగ్ సంస్థలపై కేసులు వేసినప్పుడు, కులరాజకీయల పైనా, రాయలసీమ నేతలపైనా, టీడీపీ అధినేత చంద్రబాబుపై, సీఎం జగన్ పైనా ఇలా ప్రతి అంశంపైనా తనదైన స్టైల్లో స్పందించే జేసీ దివాకర్ రెడ్డి.. ఈసారి రాజధాని ఉద్యమాన్ని ఉద్దేశించి మాట్లాడటంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇంతకీ జేసీ నిజంగానే ఆమరణ దీక్షలో కూర్చుంటారా..? లేక ఎప్పటిలాగే సంచలన కోసం ఈ కామెంట్స్ చేశారా? అనేది తేలడం లేదు. ఒకవేళ నిజంగానే ఆయన దీక్షకు కూర్చుంటే రాజధానికి మద్ధతిస్తున్న పార్టీల్లోని ఎంతమంది నేతలు మద్దతిస్తారో వేచి చూడాలి.
Published by:Purna Chandra
First published:January 02, 2021, 16:37 IST