EX MINSTER TDP SENIOR LEADER ASHOK GAJAPATI RAJU NOT ATTENDING POLITBURO MEETING NGS
Andhra Pradesh: చంద్రబాబుపై అశోక్ గజపతి రాజు అలిగారా? పొలిట్ బ్యూరో సమావేశం డుమ్మా కొట్టడానికి కారణం అదేనా?
చంద్రబాబుపై అశోక్ గజపతి రాజు, అలిగారా?
చంద్రబాబుపైనా, పార్టీ తీరుపైనా మాజీ మంత్రి, సీనియర్ నేత అశోక్ గజపతి రాజు గుర్రుగా ఉన్నారా? పార్టీ అధిష్టానం ఏ కార్యక్రమానికి పిలుపు ఇచ్చినా ఆయన తప్పక హాజరువుతారు? కానీ కీలకమైన టీడీపీ పొలిట్ బ్యూరో మీటింగ్ కు అశోక్ గజపతి రాజు హాజరవ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
టీడీపీకి అధిష్టానానికి షాక్ ల పై షాక్ లు తప్పడం లేదు. ఓ వైపు వరుస ఓటములు.. మరోవైపు పార్టీ సీనియర్ల ధిక్కార స్వరం, నిరసనల పర్వం, వర్గపోరు.. ఇలా సమస్యలతో తీవ్రంగా సతమవుతోంది. అసలు పార్టీలో ఎవరు ఉంటున్నారా? ఎవరు పక్క చూపులు చూస్తున్నారు తెలియక తలలు పట్టుకుంటోంది. గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో వంశీ, వాసుపల్లి గణేష్ లాంటి వాళ్లు ఇప్పటికే అధికారికంగా జగన్ కు జై కొట్టారు. మరికొందరు సమయం చూసి జంప్ చేసేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం ఉంది. గంటా శ్రీనివాసారావు లాంటి నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ తమపని తాము చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో పరిషత్ ఎన్నికలు టీడీపీని మరింత ఇరకాటంలో పడేశాయి.
ఇటీవల పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఘోర ఓటమితో కేడర్ పూర్తిగా నిరాశలో కూరుకుంది. సీనియర్ నాయకులు సైతం పార్టీని ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీలో మార్పులు చేయాల్సిన అవసరం ఆసన్నమైంది అంటున్నారు. అయితే మొన్నటి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఓటమికి అధికార వైసీపీ అరాచకాలే కారణమని టీడీపీ భావిస్తోంది. అందుకే ఈ సారి పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా పొలిట్ బ్యూరో సమావేశం (tdp politburo meeting) ఏర్పాటు చేసి.. సీనియర్ల అభిప్రాయాలు తీసుకున్న తరువాత దీనిపై అధికారిక ప్రకటన చేయలని భావించారు చంద్రబాబు నాయుడు (tdp chief chandra babu naidu). కానీ సీనియర్ నేత, మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు అధిష్టానానికి ఊహించని షాక్ ఇచ్చారు. పార్టీలో కీలకమైన పొలిట్ బ్యూరో సమావేశానికి ఆయన గైర్హజరు అయ్యారు. తిరుపతి ఉప ఎన్నికలు(tirupati loksabha by poll) , పరిషత్ ఎన్నికలపై పొలిట్ బ్యూరో లో చర్చించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. పార్టీలో కొందరు ఇప్పటికే ఎంపిటీసీ, జడ్పీటీసీ (mptc, ztpc) ఎన్నికలను బహిష్కరించడమే మేలు అని మెజార్టీ నేతలు పొలిట్ బ్యూరోలో అభిప్రాయపడ్డారు. అయితే ఈ నిర్ణయాన్ని ముందునుంచి అశోక్ గజపతి రాజు తిరస్కరిస్తున్నట్టు సమాచారం. అందుకే సమావేశానికి వెళ్లి.. అందరూ చెప్పారు కదా అని తల ఊపడం కన్నా సమావేశానికి దూరంగా ఉండడమే మేలను ఆయన భావించినట్టు ప్రచారం జరుగుతోంది.
సాధారణంగా పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపు ఇచ్చినా విధిగా అశోక్ గజపతిరాజు హాజరువుతారనే ముద్ర ఉంది. కానీ కీలకమైన సమావేశానికి గైర్హజరు అవ్వడం పట్ల పార్టీ నేతల్లో చర్చనీయాంశమయ్యింది. స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తే నష్టపోతామని అశోక్ గజపతిరాజు గతంలోనే చంద్రబాబుకు చెప్పినట్టు సమాచారం. దీనికి తోడు జిల్లాలో స్థానికంగా ఉన్న సమస్యలపైనా ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కారణాలతోనే పొలిట్ బ్యూరో సమావేశానికి అశోక్ గజపతిరాజు డుమ్మా కొట్టారని తెలుగుతమ్ముళ్లు అనుకుంటున్నారు.
గత నెలలో జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైసీపీ వ్యూహాలకు టీడీపీ పూర్తిగా చతికల పడింది. పంచాయతీ ఎన్నికల్లో 20 నుండి 30 శాతం టీడీపీ మద్దతు దారులు గెలిచారని చెప్పుకున్నా మున్సిపల్ ఎన్నికల్లో రెండు మున్సిపాలిటీల్లో అత్యధిక సీట్లు సాధించింది. కేవలం ఒక్క చైర్మన్ పదవికే పరిమితమైంది. ఇలాంటి సమయంలో పరిషత్ ఎన్నికలకు వెళ్లినా లాభం ఉండదని.. పరువు పోయే ప్రమాదం ఉందని ఎక్కువ మంది నాయకుల అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి కష్ట సమయంలో సీనియర్ నేత అయిన అశోక్ గజపతిరాజు అలక పార్టీకి నష్టం చేకూరుస్తుందని అధిష్టానం భావిస్తోంది. మరి దీనిపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అసలే కష్టాల్లో ఉన్న టీడీపీకి సీనియర్ల వ్యవహారం మరింత తలనొప్పులు తెచ్చిపెడుతోంది.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.