Revanth Reddy: రేవంత్ రెడ్డికి ఇప్పటికీ దూరంగానే ఆ నాయకులు.. అసలేం జరుగుతోంది ?

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లోని కొందరు నేతలు మాత్రం ఇప్పటికీ రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్‌గా ఎంపిక చేయడంపై అసంతృప్తిగానే ఉన్నారని.. ఈ కారణంగానే ఆయనకు, పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి.

  • Share this:
    తెలంగాణ కాంగ్రెస్‌లో ఒక్క కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మినహా రేవంత్ రెడ్డిని బహిరంగంగా విమర్శించే వారు లేరని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం ఇప్పుడు సైలెంట్ అయిపోయారని.. దాదాపు అందరు నేతలు మెల్లిమెల్లిగా రేవంత్ రెడ్డి దారికి వస్తున్నారని చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి అనుచరుల వాదన ఎలా ఉన్నా.. తెలంగాణ కాంగ్రెస్‌లోని కొందరు నేతలు మాత్రం ఇప్పటికీ రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్‌గా ఎంపిక చేయడంపై అసంతృప్తిగానే ఉన్నారని.. ఈ కారణంగానే ఆయనకు, పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి.

    తాజాగా జరిగిన ఓ కీలక సమావేశానికి ఇద్దరు కీలక నేతలు రాకపోవడం ఈ ప్రచారానికి ఊతమిస్తోంది. కీలకమైన హుజురాబాద్ ఉప ఎన్నిక సమీక్షా సమావేశానికి మాజీమంత్రులు జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు దూరంగా ఉండటం కొత్త చర్చకు తెరలేపింది. ఇప్పటివరకూ హుజూరాబాద్‌పై పెద్దగా ఫోకస్ చేయని కాంగ్రెస్ పార్టీ.. ఇక నుంచి కార్యాచరణ మొదలు పెట్టాలనుకుంటోంది. ఈ క్రమంలోనే పార్లమెంట్ సమావేశాలు ఉన్నప్పటీ వాటిని వదులుకుని రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి వచ్చారు. అయితే ఈ భేటీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు దూరంగా ఉన్నారు.

    హుజూరాబాద్ ఉప ఎన్నిక సమన్వయ కమిటీ కోఆర్డినేటర్‌లుగా ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఈ సమావేశానికి హాజరుకాకపోవడం కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. పీసీసీ చీఫ్‌గా రేవంత్ బాధ్యతలు తీసుకున్నప్పుడు కూడా జీవన్ రెడ్డి దూరంగానే ఉన్నారు. వీరిద్దరూ హైదరాబాద్‌లోనే ఉన్నప్పటికీ భేటీకి రాలేదని కాంగ్రెస్‌లో ఓ వర్గం చర్చించుకుంటుంది. వీరి తీరు చూస్తుంటే.. హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి కూడా దూరంగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని పలువురు భావిస్తున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డికి దూరం దూరంగా ఉంటున్న జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబులను ఆయన ఏదో రకంగా బుజ్జగించి తన దారికి తెచ్చుకుంటారా లేక లైట్ తీసుకుంటారా అన్నది చూడాలి.
    Published by:Kishore Akkaladevi
    First published: