Huzurabad: రేవంత్ రెడ్డి ఆఫర్‌కు నో చెప్పిన మాజీమంత్రి.. కేసీఆర్ వైపే..

రేవంత్ రెడ్డి, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Huzurabad: హుజూరాబాద్‌లో కాంగ్రెస్ తరపున ఎవరిని బరిలోకి దింపాలనే దానిపై కాంగ్రెస్‌ కూడా ఓ క్లారిటీకి రాలేదు.

  • Share this:
    తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి హుజూరాబాద్ ఉప ఎన్నిక మీదే ఉందన్న విషయాన్ని ఎవరూ కాదనలేరు. అక్కడ మళ్లీ గెలిచేందుకు ఈటల రాజేందర్.. ఆయనను ఓడించి గులాబీ జెండా ఎగరేయాలని టీఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. కొత్తగా టి కాంగ్రెస్ పగ్గాలు తీసుకున్న రేవంత్ రెడ్డి సైతం హుజూరాబాద్‌లో తమ సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇంకా హుజూరాబాద్‌పై కాంగ్రెస్ పూర్తిస్థాయిలో ఫోకస్ చేయడం లేదనే వాదన వినిపిస్తున్నా... అక్కడ కాంగ్రెస్ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై రేవంత్ రెడ్డి తన వంతు కృషి చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమైన మాజీమంత్రి, బీజేపీ నేత పెద్దిరెడ్డిని కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి తనవంతు ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది.

    హుజూరాబాద్‌లో కాంగ్రెస్ తరపున ఎవరిని బరిలోకి దింపాలనే దానిపై కాంగ్రెస్‌ కూడా ఓ క్లారిటీకి రాలేదు. పేరున్న నాయకుడిని బరిలోకి దింపితేనే.. టీఆర్ఎస్, బీజేపీలకు గట్టి పోటీ ఇవ్వొచ్చనే యోచనలో కాంగ్రెస్ ఉంది. రేవంత్ రెడ్డి సైతం అదే అభిప్రాయంతో ఉన్నారని సమాచారం. అందుకే మాజీమంత్రి పెద్దిరెడ్డిని కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చి.. ఆయనను హుజూరాబాద్ బరిలో నిలిపాలని రేవంత్ రెడ్డి అండ్ టీమ్ బాగానే ప్రయత్నాలు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. హుజూరాబాద్‌లో ఇప్పుడు పోటీ చేస్తే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ టికెట్ వచ్చేలా చేస్తామని రేవంత్ రెడ్డి పెద్దిరెడ్డికి హామీ ఇచ్చారని కొందరు చర్చించుకుంటున్నారు.

    అయితే పెద్దిరెడ్డి మాత్రం రేవంత్ రెడ్డి ఆఫర్‌ను కాదని.. తెలంగాణ అధికార పార్టీ అయిన టీఆర్ఎస్‌లోకి వెళ్లడానికే సిద్ధమయ్యారు. మరోవైపు పెద్దిరెడ్డి కాంగ్రెస్‌లోకి రాకపోవడంతో.. ఇక పార్టీలో ఉన్న నాయకుల్లోనే ఎవరో ఒకరిని హుజూరాబాద్ బరిలో దింపాలని కాంగ్రెస్ భావిస్తోంది. పొన్నం ప్రభాకర్ ఇక్కడ పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేయడంతో.. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగుతారన్నది ఆసక్తికరంగా మారింది.
    Published by:Kishore Akkaladevi
    First published: