• Home
  • »
  • News
  • »
  • politics
  • »
  • EX MINISTER EETALA RAJENDER TO ADDRESS THE MEDIA AT 10AM IN HYDERABAD HE MAY ANNOUNCE HIS RESIGNATION AND JOINING IN BJP SK

Eetala Rajender: కాసేపట్లో ఈటల ప్రెస్‌మీట్.. రాజీనామా చేస్తారా? భవిష్యత్ కార్యాచరణ ఏంటి?

మంత్రి ఈటల రాజేందర్ (ఫైల్)

బీజేపీలో సముచిత స్థానం కల్పిస్తామని ఈటల రాజేందర్‌కు కమలం పెద్దలు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన్ను రాజ్యసభకు పంపి.. కేంద్ర మంత్రి పదవి కూడా ఇస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

  • Share this:
    తెలంగాణ రాజకీయాల్లో కొన్ని రోజులుగా ఈటల రాజేందర్ గురించే చర్చ జరుగుతోంది. భూకబ్జా ఆరోపణలతో ఆయన్ను మంత్రి వర్గం నుంచి తొలగించారు సీఎం కేసీఆర్. మరి ఈటల ఏం చేయబోతున్నారని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇటీవలే ఆయన ఢిల్లీలో పర్యటించారు. బీజేపీ అగ్రనేతలతో సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన తన అనుచరులు, కార్యకర్లతోనూ సమాలోచనలు చేశారు. అనంతరం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం 10 గంటలకు మీడియా ముందుకు రానున్నారు. ఢిల్లీ పర్యటన విశేషాలతో పాటు భవిష్యత్ కార్యాచరణను కూడా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇవాళ ఎమ్మెల్యే పదవితో పాటు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామాను ప్రకటించే అవకాశముందని సమాచారం.

    బీజేపీలో చేరేందుకు ఈటల రాజేందర్ నిర్ణయించుకున్నారని తెలిసింది. బీజేపీ పెద్దలు కూడా ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈటల రాజేందర్‌తో పాటు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కరీంనగర్‌ జిల్లా మాజీ జడ్పీ ఛైర్‌ పర్సన్‌ తుల ఉమ, ఈటల ప్రధాన అనుచరుడు సమ్మిరెడ్డి బీజేపీలో చేరతారని సమాచారం. ఇక మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. కొన్ని రోజులుగా ఆయన ఈటల రాజేందర్‌తో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలోనూ లేరు. తన గళాన్ని వినిపించే మంచి వేదిక కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్‌తో కలిసి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా కాషాయ దళంలో చేరతానని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు టీఆర్ఎస్ పార్టీలో ఈటల సన్నిహితుుగా గుర్తింపు పొందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, పలువురు నేతలు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం.

    బీజేపీలో సముచిత స్థానం కల్పిస్తామని ఈటల రాజేందర్‌కు కమలం పెద్దలు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన్ను రాజ్యసభకు పంపి.. కేంద్ర మంత్రి పదవి కూడా ఇస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత హుజురాబాద్‌లో ఉప ఎన్నికలు వస్తే.. అక్కడ బీజేపీ తరపున ఈటల రాజేందర్ భార్య జమున పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్ట్‌లు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం.. బీజేపీలో ఎవరికీ ముందస్తు హామీలు ఉండవని ఇటీవల అన్నారు. పనిచేసే వారికి ఖచ్చితంగా గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు.

    మొత్తంగా ఈటల రాజేందర్ భవిష్యత్ కార్యాచరణపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశముంది. టీఆర్ఎస్ పార్టీతో పాటు తెలంగాణ ప్రభుత్వంలో తన అనుభవాలను వివరిస్తూనే..ప్రెస్ మీట్‌లో సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. ఇటు పార్టీ, అటు ప్రభుత్వంలో.. తాను ఎదుర్కొన్న అవమానాలను మరోసారి మీడియా ముందు చెప్పనున్నట్లు సమాచారం.
    Published by:Shiva Kumar Addula
    First published: