తెలంగాణలో Bharatiya Janata Partyదూకుడు పెంచింది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలు సాధించడంతో.. ఇక పార్టీలో చేరికలపై కమలనాథులు దృష్టి సారించారు. మెజార్టీ స్థానాల్లో పార్టీకి బలమైన నాయకులు అవసరమనే భావనలో ఉన్న బీజేపీ.. బలమైన నేతలను తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. పార్టీలోని వివిధ నేతలు ఈ విషయంలో తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. తాజాగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీమంత్రి డీకే అరుణ.. మాజీమంత్రి ఎ. చంద్రశేఖర్‌ను బీజేపీలోకి తీసుకొచ్చే బాధ్యతను తీసుకున్నారు.
ఇందుకోసం స్వయంగా చంద్రశేఖర్ ఆయన ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు డీకే అరుణ. ఉమ్మడి ఏపీలో టీడీపీ తరపున మంత్రిగా వ్యవహరించిన చంద్రశేఖర్.. ఆ తరువాత టీఆర్ఎస్లో చేరారు. అనంతరం కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ బలహీనపడటంతో.. ఆయన బీజేపీలోకి వెళ్లడానికి సిద్ధమయ్యారు. డీకే అరుణ రాయబారంతో కాషాయదళంలో చేరడానికి చంద్రశేఖర్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.

చంద్రశేఖర్ కుటుంబసభ్యులతో డీకే అరుణ
ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దల సమక్షంలో పార్టీలో చేరాలని భావిస్తున్న చంద్రశేఖర్.. గతంలో తాను ప్రాతినిథ్యం వహించిన వికారాబాద్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి తెలంగాణలో బలమైన నేతలను ఆకర్షిస్తున్న బీజేపీ.. నియోజకవర్గాలవారీగా టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నట్టు అర్థమవుతోంది. మొదటగా తెలంగాణలో బలహీనపడుతున్న కాంగ్రెస్ పార్టీలోని పలువురు నేతలను తమ వైపు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ నేతలు.. ఇప్పటికే పలువురు నాయకులతో చర్చలు కూడా జరుపుతున్నట్టు తెలుస్తోంది. గతంలో టీఆర్ఎస్ ఎంపీగా వ్యవహరించి ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి సైతం త్వరలోనే బీజేపీలో చేరతారని వార్తలు వస్తున్నాయి. ఆయనతో పాటు క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కొనే నాయకుల జాబితాను సిద్ధం చేసుకున్న బీజేపీ నాయకత్వం.. వారిని పార్టీలోకి ఆహ్వానిస్తోందని తెలుస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published:December 11, 2020, 20:48 IST