Vizag steel plant: విశాఖ ఉక్కుపై హైకోర్టుకు జేడీ: బీజేపీకి వ్యతిరేకంగా త్వరలో రాజకీయ నిర్ణయం!

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హైకోర్టులో జేడీ పిల్

విశాఖ ఉక్కు ఉద్యమంలో మరో కీలక అడుగు పడింది. ఉద్యమానికి సంఘీభావం తెలిపిన మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీ నారాయణ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని కోరుతూ హైకోర్టులో పిల్ వేశారు. మరోవైపు బీజేపీకి వ్యతిరేకంగా ఓ రాజకీయ నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం.

 • Share this:
  ఏపీ వ్యాప్తంగా విశాఖ ఉక్కు (visakha steel plant ) ఉద్యమ నినాదం ఎగసిపడుతోంది. కేంద్రం తీరుకు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. రాజకీయాలకు అతీతంగా కీలక నేతలంతా ఉక్కు ఉద్యమంలో మేము సైతం అంటున్నారు. ఇటీవల అనకాపల్లిలోని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (tdp mla ganta srinivasa rao) కార్యాలయంలో.. గంటా శ్రీనివాసరావుతో మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ (jd laxmi narayana), మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (vundavalli arun kumar) భేటీ అయ్యారు. విశాఖ ఉక్కు ఉద్యమంలో రాజకీయ పరంగా, న్యాయ పరంగా ఎలా ముందుకు వెళ్లాలి అన్నదానిపై చర్చించినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా జేడీ లక్ష్మి నారాయణ కీలక నిర్ణయం తీసుకున్నారు.

  తాజాగా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మాజీ ఐపీఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కేంద్ర కేబినెట్‌ తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని ఆయన తన పిటిషన్ లో కోరారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏర్పడిన వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయెద్దంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోంది. కార్మిక సంఘాలు చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా నిలిచిన లక్ష్మీనారాయణ.. విశాఖ ఉక్కును నష్టాల నుంచి లాభాల బాటలోకి తీసుకొచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

  విశాఖ ఉక్కు పరిశ్రమలోని 100 శాతం వాటాలను అమ్ముతున్నట్లు ఈ నెల 8న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రకటించిన దగ్గర నుంచి ఆందోళనలు ఉద్ధృతం అయ్యాయి. ఆ రోజు రాత్రి నుంచే విరామం లేని పోరాటం చేస్తున్నారు కార్మికులు. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా ఉద్యమం వ్యాపించింది. ప్రస్తుతం కార్మిక, విద్యార్థి, రాజకీయ సంఘాలకు మాత్రమే పరిమితమైన ఈ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. తమ ఉద్యమానికి ప్రజలంతా స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వాలి అంటూ కార్మిక సంఘాలు పిలుపు ఇస్తున్నాయి. మరోవైపు రాజకీయ నేతలు, మేధావులు, మాజీ అధికారులు ఎవరి పంతాలో వారు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇలా ఉక్కు ఉద్యమం ఉద్ధృతం అవుతున్న సమయంలో మాజీ ఐపీఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ మద్దతు కీలకమైంది.

  ఆయన కేవలం కార్మికులకు సంఘీభావం తెలిపి చేతులు దులుపుకోలేదు. మొదట ప్రధానికి పలు సూచనలు చేస్తూ లేఖ రాశారు. వాటిని అమలు చేస్తే మళ్లీ పూర్వవైభవం తీసుకురావచ్చని లేఖలో పేర్కొన్నారు. దేశంలో మిగిలిన కర్మాగారాలకు భిన్నంగా విశాఖ ఉక్కును చూడాలని అన్నారు. సముద్రతీరంలో ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్ విశాఖే అని ఆయన కోరారు. ఎగుమతి, దిగుమతులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఇదేనన్నారు. రానున్న కాలంలో స్టీల్‌కు డిమాండ్ పెరగనుందని.. మొన్నటి బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థికమంత్రి సీతారామన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారన్నారు. స్టీల్ పరిశ్రమలను ప్రయివేటీకరిస్తే… సిమెంట్ పరిశ్రమలకు పట్టిన గతే పడుతుందన్నారు. ధరలన్నీ కంపెనీ వాళ్ల చేతుల్లో ఉంటాయని హెచ్చరించారు. మిగిలిన స్టీల్ కంటే విశాఖలో ఉత్పత్తి అయ్యేది నాణ్యమైనదని తెలిపారు. చిన్న చిన్న మార్పులతో విశాఖ ఉక్కును తిరిగి లాభాల్లోకి తీసుకు రావొచ్చని అభిప్రాయపడ్డారు.

  కొన్ని ప్రతిపాదనలతో కూడిన లేఖ రాసినా ఇప్పటి వరకు కేంద్రం నుంచి స్పందన రాలేదు. అంతేకాదు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇంకాస్త దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది. తొందరగా ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో జేడీ లక్ష్మి నారయణ హైకోర్టును ఆశ్రయించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని కోరుతూ ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. దీన్ని హైకోర్టు విచారణకు స్వీకరిస్తే.. కేంద్రం దూకుడుకు కాస్త బ్రేకులు పడతాయని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి.

  మరోవైపు రాజకీయంగా కూడా గంటా, ఉండవల్లి, జేడీ కలసి కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తిరుపతి ఉప ఎన్నికలో విశాఖ ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్న అభ్యర్థి తరుపున ప్రచారం చేయాలని.. బీజేపీకి డిపాజిట్లు కూడా రాకుండా చేయగలిగితే.. కేంద్ర తమ నిర్ణయాన్ని పునరాలోచణ చేస్తుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు తుది నిర్ణయం తీసుకులేదని సమాచారం.
  Published by:Nagesh Paina
  First published: