కొన్ని ఎన్నికలు కొందరిని హీరోలను చేస్తాయి. మరికొందరికి ఊహించని షాక్ ఇస్తాయి. మరికొందరి ఇమేజ్ను ఊహించని విధంగా డ్యామేజ్ చేస్తుంటాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికలు టీఆర్ఎస్ ముఖ్యనేత, మంత్రి హరీశ్ రావు ఇమేజ్ను అదే రకంగా డ్యామేజ్ చేశాయనే ప్రచారం మొదలైంది. ఈటల రాజేందర్ టీఆర్ఎస్కు, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కొద్దిరోజులకే.. ఆయనను ఓడించేందుకు మంత్రి హరీశ్ రావును రంగంలోకి దించారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కొన్ని నెలల ముందు నుంచి హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు వ్యూహాలను రచించిన కేసీఆర్.. వాటిని అమలు చేసే బాధ్యతను హరీశ్ రావుకు అప్పగించారు. ప్రత్యర్థులను చిత్తుచేసే రాజకీయ వ్యూహాలను పక్కాగా అమలు చేసి పార్టీకి విజయాలు సాధించే హరీశ్ రావు.. తన పాత మిత్రుడు ఈటల రాజేందర్‌ను ఓడిస్తారని పార్టీ శ్రేణులు భావించాయి.
గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే హుజూరాబాద్ నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన హరీశ్ రావు.. అప్పటి నుంచి ఎక్కువగా ఆ నియోజకవర్గంలోనూ ఉంటూ టీఆర్ఎస్ విజయం కోసం వ్యూహరచన చేశారు. నియోజకవర్గంలోని వివిధ వర్గాలను కలుస్తూ టీఆర్ఎస్కు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. దుబ్బాకలో టీఆర్ఎస్ అనూహ్య ఓటమితో ఇబ్బందిపడ్డ హరీశ్ రావు.. హుజూరాబాద్‌లో పార్టీని గెలిపించి దుబ్బాక ఓటమి గాయం మానేలా చేయడానికి విశ్వప్రయత్నాలు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారం కోసం సీఎం కేసీఆర్ రాకపోవడంతో.. ప్రచార బాధ్యతలను మొత్తం తన భుజాన వేసుకున్నారు. హరీశ్ రావు హుజూరాబాద్‌లో ఉండటంతో.. టీఆర్ఎస్ తక్కువ మెజార్టీతో అయినా విజయం సాధిస్తుందని ఆ పార్టీ శ్రేణులు భావించాయి.
కానీ టీఆర్ఎస్ అంచనాలు తల్లకిందులయ్యాయి. హరీశ్ రావు కొన్ని నెలలపాటు హుజూరాబాద్‌లో ఉంటూ నడిపిన మంత్రాంగం గులాబీ పార్టీకి విక్టరీని తెచ్చిపెట్టలేకపోయింది. దుబ్బాకలో పార్టీని గెలిపించుకోలేకపోయిన హరీశ్ రావు.. మరోసారి హుజూరాబాద్‌లోనూ అదే పరిస్థితి ఎదురుకావడంతో.. ఆయనకు పార్టీలో ఉన్న ట్రబూల్ షూటర్ ఇమేజ్ మసకబారేలా చేసిందనే ఊహాగానాలు మొదలయ్యాయి.
KCR-KTR: కేటీఆర్‌కు మరిన్ని పవర్స్ ఇచ్చిన సీఎం కేసీఆర్.. వాటిపై నిర్ణయం కేటీఆర్‌దేనా ?
Revanth Reddy: రేవంత్ రెడ్డి ‘ముందస్తు’ మాటల వెనుక మాస్టర్ ప్లాన్ ?
అయితే హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ విజయానికి అనుకూలమైన పరిస్థితులు లేవని.. అందుకే సీఎం కేసీఆర్ అక్కడి బాధ్యతలను మంత్రి హరీశ్ రావుకు అప్పగించారనే చర్చ కూడా సాగుతోంది. మరోవైపు హరీశ్ రావు రంగంలోకి దిగి పని చేయడం వల్లే టీఆర్ఎస్ ఈ స్థాయిలో అయినా ఓట్లు సాధించిందని.. అలా జరగకపోయి ఉంటే ఈటల రాజేందర్ మెజార్టీ మరింతగా పెరిగే అవకాశం ఉండేదనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు హరీశ్ రావు వ్యూహాలు పని చేయని దుబ్బాక, హుజూరాబాద్‌లో కాంగ్రెస్ కాకుండా బీజేపీ విజయం సాధించడం విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.