Huzurabad: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ భార్య జమున నామినేషన్.. అసలు కారణం ఇదే.. ఆమె ఆస్తుల విలువ ఎంతంటే..

ఈటల జమున (ఫైల్ ఫోటో)

Etela Jamuna: హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలోకి దిగుతున్న మాజీమంత్రి ఈటల రాజేందర్ భార్య జమున నామినేషన్ దాఖలు చేశారు. ఆమె తరపున బీజేపీ నేతలు నామినేషన్ వేశారు.

 • Share this:
  హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రస్తుతం నామినేషన్ పర్వం కొనసాగుతోంది. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు, ఇండిపెండెంట్లు తమ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలోకి దిగుతున్న మాజీమంత్రి ఈటల రాజేందర్ భార్య జమున నామినేషన్ దాఖలు చేశారు. ఆమె తరపున బీజేపీ నేతలు నామినేషన్ వేశారు. పార్టీ ఆదేశాల మేరకు జమున నామినేషన్‌ను తాము దాఖలు వేసినట్టు వారు తెలిపారు. జమున తరపున ఒక సెట్ నామినేషన్ వేసినట్టు వెల్లడించారు. తన నామినేషన్‌తో పాటు తమ ఆస్తులు, అప్పులు, ఇతర వివరాలకు సంబంధించిన అఫిడవిట్‌ను ఈటల జమున సమర్పించారు. దీని ప్రకారం ఆమె పేరు మీద ఉన్న మొత్తం ఆస్తుల విలువ రూ. 43,47,05,894. ఇందులో చరాస్థులు విలువ రూ. 28,68,21,894, స్థిరాస్తుల విలువ రూ. 14,78,84,000. ఈటల జమునకు రూ. 4,89,77,978 అప్పులు ఉన్నాయి.

  ఇప్పటికే మాజీమంత్రి ఈటల రాజేందర్‌ను బీజేపీ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా నేతలు ఈ రకమైన తమ భార్యతో నామినేషన్ వేయించడం సర్వసాధారణం. ఒకవేళ ఏదైనా ఒక కారణంతో నేతల నామినేషన్లు తిరస్కరణకు గురైతే.. అప్పుడు తమ భార్యను ఎన్నికల్లో అభ్యర్థిగా నిలుపుతారు. ఈ క్రమంలోనే బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న మాజీమంత్రి ఈటల రాజేందర్.. ముందుజాగ్రత్త కోసం తన సతీమణి ఈటల జమునతో నామినేషన్ దాఖలు చేయించారు.

  ఇదిలా ఉంటే మాజీమంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన అనంతరం ఈటల జమున వార్తల్లో నిలిచారు. హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలు వస్తే బీజేపీ తరపున జమున ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఆమె కూడా పరోక్షంగా ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు గుప్పించారు. నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించిన తన భర్త ఈటల రాజేందర్‌కు అండగా నిలిచారు.

  ఆ తేదీల్లో ఈటలపై దాడి.. ఆ తరువాత రంగంలోకి జమున.. బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు..

  Huzurabad: ఆ ఇద్దరు మంత్రులకు ‘హుజూరాబాద్’ టెన్షన్.. తేడా వస్తే అలా జరుగుతుందా ?

  హుజూరాబాద్ ఉప ఎన్నికల తేదీ ఖరారు కావడంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. టీఆర్ఎస్ తరపున గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో ఉండగా.. బీజేపీ తరపున ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ కసరత్తు తరువాత బల్మూరి వెంకట్‌ను పోటీలో నిలిపింది. ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రభుత్వం తొలిగించిన ఫీల్డ్ అసిస్టెంట్లు పెద్ద సంఖ్యలో సిద్ధమవుతున్నారు. వారిలో చాలామందికి వైెఎస్ షర్మిల సారథ్యంలోని వైఎస్ఆర్‌టీపీ అండగా నిలుస్తోంది.
  Published by:Kishore Akkaladevi
  First published: