గవర్నర్‌తో కూటమినేతలు-ఓవైసీతో కేసీఆర్.. తెలంగాణలో ముందస్తు భేటీల ముచ్చట్లేంటి?

Telangana assembly elections2018|తెలంగాణలో ఎన్నికల ఫలితాల విడుదలకు ఒక్కరోజే మిగిలింది. మరో 24 గంటల్లో ఏవీఎం మిషన్లు తాళాలు తెరుచుకుని.. రాజకీయ పార్టీల భవిష్యత్తును తెలుపనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఫలితాలు వెలువడకముందే ముందస్తు భేటీలు జోరందుకున్నాయి.

news18-telugu
Updated: December 10, 2018, 11:13 AM IST
గవర్నర్‌తో కూటమినేతలు-ఓవైసీతో కేసీఆర్.. తెలంగాణలో ముందస్తు భేటీల ముచ్చట్లేంటి?
mundastu bheti file
  • Share this:
తెలంగాణలో ఓట్ల లెక్కింపునకు కౌంట్ డౌన్ స్టార్టయ్యింది. అధికార పీఠం ఎవరిని వరించబోతోందో.. మరో 24 గంటల్లో తేలబోతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ప్రధాన పార్టీలు జోరుగా ముందస్తు భేటీలు జరుపుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎవరికివారు ఫలితాలపై ఒక అంచనా వేసుకుంటూ.. ఫలితాలు ఎలా వచ్చినా పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే అధికార, విపక్ష నేతలు.. ముందస్తు ప్లాన్ రెఢీ చేసుకుంటున్నారు. దీంతో, రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరగబోతోందన్న సస్పెన్స్ కొనసాగుతోంది.

ఎగ్జిట్‌పోల్స్ అనంతరం.. ఎవరికివారు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్న రాజకీయపార్టీలు.. తర్వాతి కార్యక్రమాలపై ద‌ృష్టిపెట్టాయి. ఫలితం ఎలా ఉంటుందో చెప్పలేం కాబట్టి.. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ప్రజాకూటమి నేతలు గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరగా, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ను కలవబోతున్నారు. ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే వేళ..ఈ ముందస్తు భేటీల ముచ్చటేంటి? అని జనం గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. స్వతంత్రులతో టచ్‌లో ఉన్నారనే పుకార్లు రాజకీయవర్గాల్లో జోరందుకున్నాయి. ఫలితాలు ఏమాత్రం అంచనా తప్పినా.. వారి మద్దతుతో అధికారాన్ని చేజిక్కించుకోవడం ఆయన వ్యూహం కావొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీతోనూ కేసీఆర్ భేటీ కాబోతున్నారు. ఒకవేళ హంగ్ ఏర్పడితే ఏవిధంగా ముందుకెళ్లాలనే అంశంపై ఇరువురు నేతలు చర్చించనున్నట్టు తెలుస్తోంది. పూర్తి మెజార్టీ రాకపోతే రెండు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచనపైనా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు, ప్రజాకూటమి నేతలు గవర్నర్‌ను కలవబోతుండడం.. రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడిని పెంచింది. ప్రజాకూటమికి వచ్చే సీట్లను ఒక్కటిగానే భావించాలని.. కూటమినేతలు గవర్నర్‌ను కోరనున్నారు. కూటమిలోని అన్ని పార్టీలకు కలిపి అధికస్థానాలు వస్తే.. అతిపెద్ద పార్టీగా కూటమినే పరిగణించాలని కోరనున్నారు. ఇక, గవర్నర్‌తో భేటీ అనంతరం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఢిల్లీ వెళ్లబోతున్నారని వార్తలు.. రాజకీయవర్గాల్లో మరింత వేడిని పెంచుతున్నాయి. రాబోయే ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఎవరు గెలవబోతున్నారు? అనే అంశంలో మరింత సందిగ్ధత ఏర్పడింది. ముందస్తు భేటీల హడావిడితో రాష్ట్రంలో రాజకీయం మరింత హాట్ హాట్‌గా మారిపోయింది. మరి ఈ ముందస్తు భేటీలు ఏం తేలుస్తాయి? ఎవరు ఎవరితో కలవబోతున్నారు? అనే విషయాలు ఫలితాలు విడుదలయ్యాకే తెలిసే అవకాశం ఉంది.
Published by: Santhosh Kumar Pyata
First published: December 10, 2018, 11:09 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading