12 ఏళ్ల పాటు గవర్నర్... నరసింహన్ ఆల్ టైమ్ రికార్డు

యూపీఏ కాలంలో నియమితులైన గవర్నర్లు అందరూ స్థానభ్రంశం చెందారు. కానీ, నరసింహన్ ఒక్కరే ఎన్డీయే హయాంలో కూడా ఐదేళ్లపాటు కంటిన్యూ కాగలిగారు.

news18-telugu
Updated: September 7, 2019, 5:02 PM IST
12 ఏళ్ల పాటు గవర్నర్... నరసింహన్ ఆల్ టైమ్ రికార్డు
గవర్నర్ నరసింహన్(File)
  • Share this:
తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు తెలంగాణ ప్రభుత్వం వీడ్కోలు పలికింది. తెలంగాణకు కొత్త గవర్నర్ నియామకం కావడంతో నరసింహన్ ఇవాళ ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లిపోయారు. బేగంపేట విమానాశ్రయంలో నరసింహన్ దంపతులకు తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు, అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. అయితే, తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ రికార్డు బద్దలు కొట్టారు. దేశంలో అందరికంటే ఎక్కువకాలం గవర్నర్‌గా పనిచేసిన రికార్డును నెలకొల్పారు. ఆ రకంగా ఆలిండియా టాపర్‌గా నిలిచారు. 2007వ సంవత్సరం నుంచి 2019 వరకు అంటే, పుష్కరకాలం పాటు గవర్నర్‌గా పనిచేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. 2009 డిసెంబర్ 27న తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులయ్యారు.  అప్పటి నుంచి ఏపీకి కొత్త గవర్నర్ వచ్చే వరకు రెండు రాష్ట్రాలకు ఆయనే గవర్నర్‌గా కొనసాగారు. ఆ తర్వాత తెలంగాణ గవర్నర్‌గా కొనసాగారు. ఆంధ్రప్రదేశ్‌కు రాకముందు ఆయన తొలిసారిగా ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా సేవలు అందించారు. 2007 జనవరి 25 నుంచి 2009 డిసెంబర్ 27 వరకు, అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులు అయ్యే వరకు ఆయన ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా పనిచేశారు.

అత్యధికకాలం గవర్నర్‌గా పనిచేసిన వారు

ఈఎస్ఎల్ నరసింహన్ (12 సంవత్సరాలు 7 నెలలు. ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ)
సుర్జీత్ సింగ్ బర్నాలా (11 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్)


ఎక్కువకాలం గవర్నర్‌గా పదవీ బాధ్యతలు నిర్వర్తించిన ఘనతతో పాటు మరో కేటగిరీలో ఆయన రెండో స్థానంలో నిలిచారు. గతంలో స్వాతంత్ర్య ఉద్యమకారిణి సరోజినీ నాయుడు కుమార్తె పద్మజానాయుడు 1956 నవంబరు 3 నుంచి 1967 జూన్‌ 1 వరకు (10 సంవత్సరాల 209 రోజులు) ఒకేచోట పనిచేశారు. నరసింహన్ రెండో స్థానంలో (9 సంవత్సరాల ఎనిమిది నెలలు) ఉన్నారు.

యూపీఏ హయాంలో నియామకమై ఎన్డీయేలో కూడా పూర్తికాలం కొనసాగిన ఒకే ఒక్క గవర్నర్‌గా కూడా నరసింహన్ రికార్డు నెలకొల్పారు. యూపీఏ కాలంలో నియమితులైన గవర్నర్లు అందరూ స్థానభ్రంశం చెందారు. కానీ, నరసింహన్ ఒక్కరే ఎన్డీయే హయాంలో కూడా ఐదేళ్లపాటు కంటిన్యూ కాగలిగారు. తాజాగా తమిళనాడకు చెందిన బీజేపీ నేత తమిళిసై సౌందర్‌రాజన్ తెలంగాణ గవర్నర్‌గా నియమితురాలు కావడంతో ఆయన పదవీకాలం ముగిసింది. సెప్టెంబర్ 8న తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై సౌందర్ రాజన్ ప్రమాణస్వీకారం చేస్తారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 7, 2019, 5:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading