ELECTION STRATEGIST PRASHANT KISHORE PLAYS KEY ROLE IN YSRCP STRONG CONTEST IN AP ELECTIONS 2019 AK
నవరత్నాలు... రాజకీయ వ్యూహాలు... వైసీపీలో ప్రశాంత్ కిశోర్ మార్క్
ప్రశాంత్ కిశోర్, వైఎస్ జగన్
Ap assembly election results 2019: రెండేళ్ల ముందుగానే 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పక్కా ప్రణాళికలను రూపొందించారు ప్రశాంత్ కిశోర్. అధికారానికి జగన్‌ను దగ్గర చేసిన పాదయాత్ర సలహా కూడా పీకేదే అని చాలామంది చెబుతుంటారు.
ప్రశాంత్ కిశోర్... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం. 2014 ఎన్నికలతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఈ పేరు ఆ తరువాత దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో అడపాదడప వినిపిస్తూనే ఉంది. ఇక ఏపీలో అయితే ప్రశాంత్ కిశోర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. సరిగ్గా మూడేళ్ల క్రితం ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన ఎంతో కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వస్తే... ప్రశాంత్ కిశోర్ పోషించిన పాత్ర ఎంతో కీలకమనే చెప్పాలి. గడిచిన మూడేళ్లలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆయన ఇచ్చిన సలహాలు ఎంతో ప్రధాన పాత్ర పోషించాయి.
ప్రశాంత్ కిశోర్‌ను పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్న తరువాత టీడీపీ నుంచి అనేక విమర్శలు వచ్చాయి. అయితే వాటిని జగన్ పట్టించుకోలేదు. రెండేళ్ల ముందుగానే 2019 ఎన్నికల కోసం పక్కా ప్రణాళికలను రూపొందించారు పీకే. వాస్తవానికి జగన్ పాదయాత్ర చేస్తే బాగుంటుందనే సలహా ఇచ్చింది కూడా ప్రశాంత్ కిశోరే. కేవలం సలహా ఇవ్వడం మాత్రమే కాదు... ఆ పాదయాత్రకు ప్రజల్లో ఆదరణ పెరగడానికి కూడా ఆయన తన వ్యూహాలను అమలు చేశారు.
ఎప్పటికప్పుడు సోషల్ మీడియాను ఉపయోగించుకుని పార్టీ అధినేతను నిత్యం ప్రజలతో టచ్‌లో ఉండేలా ప్రణాళికలు రచించారు. దాంతో పాటు జగన్ పాదయాత్ర ప్రకటన చేసిన పార్టీ ప్లీనరీ వేదికగానే ఎన్నికల మేనిఫెస్టో నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇక నంద్యాల ఎన్నికల సమయంలోనూ ప్రశాంత్ కిషోర్ వైసిపి కోసం పని చేశారు. అయితే అక్కడ వైసీపీ ఓడిపోయింది. దీంతో ప్రశాంత్ కిశోర్ సమర్థతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే జగన్ మాత్రం ఆయనపై పూర్తి విశ్వాసం ఉంచారు. అభ్యర్థుల ఖరారు... వారు అనుసరించాల్సిన వ్యూహాలు... ఇలా చాలా విషయాల్లో జగన్ పీకే ఇచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకున్నారని పార్టీ నేతలు కూడా చెబుతున్నారు.
ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతో పాటు సహజంగా ఎప్పుడూ దేవుడిని ఎక్కువగా నమ్మే జగన్ ఈ సారి ముహూర్త బలాన్ని నమ్మారు. అందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గంలోనే విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామిని విశ్వసించారు. ఆయన చెప్పిన ముమూర్తాలు.. సమయం ఆధారంగా తన నిర్ణయాలను అమలు చేశారు. అప్పటి వరకు ఏ ఆశ్రమాలకు గుళ్లకు పెద్దగా వెళ్లని జగన్ ప్రశాంత్ కిశోర్ సలహాల మేరకే స్వామిజీలను కలవడం, దేవాలయాలను సందర్శించడం చేశారు. సోషల్ మీడియా వేదికగా జగన్ ఇమేజ్ను బాగా ప్రమోట్ చేయడంలోనూ పీకే పాత్ర ఎక్కువనే చెప్పాలి. ముఖ్యంగా ఎన్నికల ప్రచారం సమయంలో కావాలి జగన్ రావాలి జగన్ స్లోగన్‌తో పాటు చంద్రబాబు టార్గెట్‌గా బైబై బాబు అనే నినాదాలు ప్రజల్లోకి బాగా వెళ్లాయి. ఇలా మూడేళ్ల పాటు వైసీపీకి తన సేవలందించారు ప్రశాంత్ కిశోర్.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.