ఏపీలో ఏం జరుగుతోంది? చంద్రబాబు రహస్య జీవోలపై ఈసీ దృష్టి

గత నెలరోజుల్లో పలు రహస్య జీవోలు జారీ అయ్యాయి. ఇవి కేవలం మున్సిపల్, రెవెన్యూ శాఖలకు సంబంధించినవే. ఆయా శాఖల్లోని అంశాలపై అంతగా రహస్య జీవోలు జారీ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందనేది ఇప్పుడు ఎవరికీ అంతుబట్టడం లేదు.

news18-telugu
Updated: April 22, 2019, 9:09 AM IST
ఏపీలో ఏం జరుగుతోంది? చంద్రబాబు రహస్య జీవోలపై ఈసీ దృష్టి
చంద్రబాబునాయుడు(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: April 22, 2019, 9:09 AM IST
ఏపీలో ప్రభుత్వానికీ, ఈసీకి మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం ఈ మధ్య తీసుకున్న పలు నిర్ణయాలు, సీఎం సమీక్షలపై ఈసీ సీరియస్ అయింది. కోడ్ అమల్లో ఉండగా ఆపద్ధర్మ ప్రభుత్వ పెద్దలు కీలక నిర్ణయాలు తీసుకోవడం అనైతికమనే చర్చ సాగుతోంది. అదే సమయంలో ప్రభుత్వం జారీ చేస్తున్న రహస్య జీవోలు కూడా చర్చనీయాంశం అయ్యాయి,. ఇప్పుడు ఈసీ వీటిపై దృష్టిపెట్టినట్లుగా తెలుస్తోంది.
సాధారణంగా హోంశాఖ, ఆర్ధికశాఖ, సీఎం విదేశీ పర్యటనలు వంటి సున్నిత విభాగాల్లో ప్రభుత్వాలు రహస్య జీవోలు జారీ చేస్తుంటాయి. వీటి వివరాలు బయటికి పొక్కితే ప్రజలు, ఉద్యోగులు, అధికారుల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉండటం, భద్రతా పరమైన అంశాలు వీటికి కారణంగా ఉంటాయి. కానీ దానికి విరుద్ధంగా మున్సిపల్, రెవెన్యూ శాఖల్లోనూ రహస్య జీవోలు విడుదల అవుతుండటం, అదీ ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతున్న వేళ వాటి జారీ ప్రజల్లో అనుమానాలు రెకెత్తించేలా ఉంది. పారదర్శకత పాటించాల్సిన శాఖల విషయంలోనూ ఈ గోప్యత ఎందుకనేది ఇప్పుడు ప్రశ్నార్ధకమవుతోంది.

పోలవరం, సీఆర్డీయే వంటి కీలక అంశాలపై ఓ ఆపద్ధర్మ సీఎం ఎలా రెగ్యులర్ సమీక్షలు నిర్వహిస్తారంటూ విపక్షం నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈసీ ఇప్పటికే సీఎస్ ను వివరణ కోరింది. దీంతో సీఎస్ కాస్తా సమీక్షల్లో పాల్గొన్న అధికారులను వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చారు. దీనిపై ఓ వైపు రచ్చ కొనసాగుతూనే ఉంది. ప్రజాసంక్షేమ అంశాలపై క్రియాశీలకంగా పనిచేయకపోతే సమస్యలు పేరుకుకుపోతాయని ప్రభుత్వం ఆందోళన చెందుతూనే ఉంది. అంతవరకూ సమంజసమే అయినా కొత్త ప్రభుత్వం ఏర్పాటు పెండింగ్ లో ఉన్న సమయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం నైతికం కాదని రాజ్యాంగ విశ్లేషకులు సైతం చెప్పే మాట. కానీ ప్రభుత్వం మాత్రం అంతటితో సరిపెట్టకుండా రహస్య జీవోల జోలికి వెళ్లడం మరో కొత్త చర్చకు తావిస్తోంది.

కోడ్ అమల్లో ఉన్న సమయంలో గత నెలరోజుల్లో పలు రహస్య జీవోలు జారీ అయ్యాయి. ఇవి కేవలం మున్సిపల్, రెవెన్యూ శాఖలకు సంబంధించినవే. ఆయా శాఖల్లోని అంశాలపై అంతగా రహస్య జీవోలు జారీ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందనేది ఇప్పుడు ఎవరికీ అంతుబట్టడం లేదు. కోడ్ అమలుపై రాష్ట్రంలో విస్తృత చర్చ జరుగుతున్న వేళ రహస్య జీవోల విడుదల కొనసాగుతుండటంపై ఈసీ దృష్టిసారించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే రహస్య జీవోల జారీపై ఫిర్యాదులు అందడంతో వాటిపై ఆరా తీస్తోంది. వీటిపై ఇప్పటికిప్పుడు చర్యలేవీ లేకపోయినా వాటి వెనుక ఉద్దేశాలను తెలుసుకునేందుకు ఈసీ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. వీటిలో ఏవైనా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎవరికైనా మేలు చేసేందుకు ఇచ్చిందా అన్న కోణంలోనూ ఈసీ దీనిపై దృష్టిసారించే అవకాశం ఉంది.ఇప్పటికే సమీక్షలు, నిర్ణయాల విషయంలో ఈసీ తమను ఎలా అ‌డ్డుకుంటుందంటూ చంద్రబాబు సర్కారు రచ్చ రచ్చ చేస్తున్న నేపథ్యంలో రహస్య జీవోల విషయంలో ఈసీ మరోసారి దూకుడుగా ముందుకు వెళుతుందా అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్ధితి. అయితే నిబంధనల మేరకు అవి ఉన్నాయా లేవా అన్న విషయంపై వివరణ కోరవచ్చనే వాదన వినిపిస్తోంది. ఏదేమైనా ఈసీ ఈ అంశంపై స్పందిస్తే మాత్రం టీడీపీ నేతలు మరోసారి నోటికి పనిచెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.

(సయ్యద్ అహ్మద్,న్యూస్ 18 తెలుగు, సీనియర్ కరస్పాండెంట్)
First published: April 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...