Eetala Rajender: ఈటెల రాజేందర్‌పై వేటు.. తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్

కేసీఆర్, ఈటల రాజేందర్ (ఫైల్ ఫోటో)

ఈటెలను మంత్రివర్గం నుంచి తొలగించడంతో.. ఆయన ఎలాంటి స్టెప్ తీసుకుంటారన్నది తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కబ్జా చేశారని దర్యాప్తులో తేలినందున పార్టీ నుంచి కూడా ఈటెలను తొలగిస్తారా? లేదంటే ఈటెల రాజేందరే పార్టీ నుంచి బయటకు వస్తారా? అనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది.

 • Share this:
  తెలంగాణ రాజకీయాలు  మరింతగా వేడెక్కాయి. ఈటెల రాజేందర్ వ్యవహారంపై గుర్రుగా ఉన్న సీఎం కేసీఆర్ ... ఆయన్ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు. ఈ మేరకు సీఎం కార్యాలయం గవర్నర్‌కు లేక పంపించింది. సీఎం కేసీఆర్ ప్రతిపాదనకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదం తెలిపారు. శనివారం ఈటల రాజేందర్ నిర్వహించే వైద్య,ఆరోగ్యశాఖను తనకు కేటాయించుకున్నారు. ఈటెల రాజేందర్‌ వద్ద ఎలాంటి మంత్రిత్వశాఖ లేకుండాపోయింది. ఇవాళ ఈటల భూకబ్జాకు సంబంధించి దర్యాప్తు కమిటీ ప్రభుత్వానిక నివేదిక సమర్పించడంతో.. దానికి అనుగుణంగా ఈటెలపై చర్యలకు ఉపక్రమించింది తెలంగాణ సర్కార్. భూములను కబ్జా చేశారని తేల్చడంతో ఆయన్ను కేబినెట్ నుంచి తొలగించింది.

  మెదక్ జిల్లా మాసాయిపేట మండలం హకీంపేట, అచ్చంపేట గ్రామాల్లో భూముల కబ్జా జరిగినట్టు దర్యాప్తు కమిటీ నిగ్గు తేల్చింది. జమున హేచరిస్ ఆధీనంలో అక్రమంగా 66 ఎకరాల భూములు ఉన్నట్టు గుర్తించారు. వీటిలో అనుమతి లేకుండా అసైన్డ్ భూముల్లో చెట్లను తొలగించారని నివేదికలో పేర్కొన్నారు. అనుమతి లేకుండా జమున హేచరీస్ పౌల్ట్రీ షెడ్డులు నిర్మించారని.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను ఎగవేశారని నివేదికలో తెలిపారు. అసైన్డ్ ల్యాండ్‌ను ఈటల రాజేందర్ కబ్జా చేసినట్టు మెదక్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక అందించారు. దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన మెదక్ జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు.. ప్రభుత్వం పేద బడుగు వర్గాలకు ఇచ్చిన సుమారు 66.01 ఎకరాల అసైన్మెంట్ భూములను జమున హాచరీస్ వారు కబ్జాచేశారని తేల్చారు.

  ఈ మొత్తం వ్యవహారంలో 20 మంది బాధితుల నుంచి స్టేట్‌మెంట్లను రికార్డ్ చేశారు. కలెక్టర్ సహా పలువురు అధికారులు ఆయా గ్రామాలకు వెళ్లి విచారణ చేశారు. వీరిలో కొందరు మంత్రి ఈటల రాజేందర్ బెదిరించి తమ భూములను లాక్కున్నారని చెప్పినట్టు సమాచారం. ఇందులో కొన్ని పట్టా భూములను వ్యవసాయేతర భూములుగా మార్చారని నివేదికలో పొందుపర్చారు. ఈ ప్రాథమిక రిపోర్ట్ ఆధారంగానే పలు కేసులు నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

  శనివారం మీడియాతో మాట్లాడిన ఈటెల రాజేందర్.. తనపై పథకం ప్రకారం కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తాను సీఎం కేసీఆర్‌ను కలవనని స్పష్టం చేశారు. తనపై కుట్ర చేసిన వారు భవిష్యత్‌లో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. నియోజక వర్గ ప్రజలు, కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు ఈటల. ఐతే ఇప్పుడు ఈటెలను మంత్రివర్గం నుంచి తొలగించడంతో.. ఆయన ఎలాంటి స్టెప్ తీసుకుంటారన్నది తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కబ్జా చేశారని దర్యాప్తులో తేలినందున పార్టీ నుంచి కూడా ఈటెలను తొలగిస్తారా? లేదంటే ఈటెల రాజేందరే పార్టీ నుంచి బయటకు వస్తారా? అనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది.
  Published by:Shiva Kumar Addula
  First published: