• Home
 • »
 • News
 • »
 • politics
 • »
 • EETALA RAJENDER QUITS TRS AND RESIGNED TO MLA POST HE WILL JOIN IN BJP SOON SK

Eetala Rajender: ఈటల రాజీనామా..టీఆర్ఎస్‌కు గుడ్‌బై.. సీఎం కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు

మంత్రి ఈటల రాజేందర్ (ఫైల్)

సీఎం కేసీఆర్ డబ్బును, అణచివేతను, కుట్రను నమ్ముకున్నారని ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన కుట్రలను తిప్పికొడతామని.. హుజురాబాద్ ప్రజలు డబ్బులకు లొంగేవారు కాదని.. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టుకోరని స్పష్టం చేశారు.

 • Share this:
  మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవితో పాటు టీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. శామీర్‌పేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు ఈటల. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. బతికి ఉండగానే బొందపెట్టమని కేసీఆర్ ఆదేశించినట్లు ఆయన వాపోయారు. సీఎం కేసీఆర్‌కు తనకు ఐదేళ్ల క్రితమే గ్యాప్ ఉందని.. మంత్రి హరీష్ రావుకు కూడా ఇవే అవమానాలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చారు. కేసీఆర్ పాలనలో మంత్రి పదవి.. బానిస కంటే దారుణంగా అయిందని మండిపడ్డారు. ప్రగతిభవన్‌ను బానిస నిలయంగా మార్చుకోవాలని సీఎం కేసీఆర్‌పై ఎదురు దాడికి దిగారు ఈటల రాజేందర్.

  ''నా వివరణ తీసుకోకుండానే మంత్రివర్గం నుంచి తొలగించారు. కనీసం ఏం జరిగిందో తెలుసుకోకుండా విచారణకు ఆదేశించారు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను. కానీ నన్ను బతికి ఉండగానే బొందపెట్టమని హరీష్‌రావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. నియోజకవర్గ ప్రజలను డబ్బులిచ్చి కొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నాకు జరిగిన అన్యాయాన్ని చూసి ప్రజలు కూడా బాధపడుతున్నారు. కుట్రలను తిప్పికొడతామని, కడుపులో పెట్టుకొని చూసుకుంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని.. మేం మళ్లీ గెలిపించుకుంటామని చెప్పారు. అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా. 19 ఏళ్ల టీఆర్ఎస్ అనుబంధానికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. కేసీఆర్ తన సొంత కూతురికి కూడా బీఫామ్ ఇచ్చారు. కానీ ఆమె ఓడిపోయారు. ఈటల రాజేందర్ అనే కార్యకర్త ఎప్పుడు కూడా ఓడిపోలేదు.''అని ఈటల రాజేందర్ అన్నారు.

  నల్గొండ, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసని ఈటల రాజేంద్ అన్నారు. సీఎం కేసీఆర్ డబ్బును, అణచివేతను, కుట్రను నమ్ముకున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఆయన కుట్రలను తిప్పికొడతామని.. హుజురాబాద్ ప్రజలు డబ్బులకు లొంగేవారు కాదని.. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టుకోరని స్పష్టం చేశారు ఈటల రాజేందర్. డబ్బులతో హుజురాబాద్ ఉపఎన్నికల్లో గెలిస్తే గెలవచ్చని.. కానీ రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను నమ్మబోరని ఆయన అన్నారు.

  ఈటల ప్రెస్‌మీట్‌లో ముఖ్యాంశాలు:

  ఒక్క మంత్రి పదవి ఇచ్చి బానిసలా బతకమంటే నేను బతకను. కోపం అనే నరాన్ని, రోషం అనే నరకాన్ని కట్ చేశారు. మీకన్నా ఉన్నతంగా ఉండాలని నేనెప్పుడూ కోరలేదు. కేటీఆర్ సీఎం అయినా ఆయన కింద పనిచేస్తానని చెప్పాను.

  మీరు లాలూ ప్రసాద్‌లా, మాయవతిలా, జయలలితలా పెట్టిన పార్టీ కాదు. నా వెంట ఎవరూ లేరు.. నేను, నా భార్య మాత్రమే ఉన్నామని చెబితేనే అందరం వచ్చాం. ప్రత్యేక రాష్ట్రం కోసం పనిచేశాం. అందరం కొట్లాడితేనే రాష్ట్రం వచ్చింది.

  బయట వ్యక్తులు లోపలికి వచ్చారు. లోపలి వ్యక్తులను బయటకు పంపిస్తున్నారు. మీకు ఎవ్వరూ లేనప్పుడు మేం అండగా ఉన్నాం. మిమ్మల్ని ఒక్కమాట అన్నా మేం ఎదురొడ్డి నిలిచాం.

  అడుక్కుంటే వచ్చేది కాయో పండో మాత్రమే. కొట్లాడితే వచ్చేది హక్కు. ఎవరి దయాదాక్షిణ్యాలతో మంత్రి పదవి రాలేదు. కష్టపడి పనిచేస్తే వచ్చింది.

  విజయశాంతి, ఆలె నరేందర్, కోదండరామ్‌ను కూడా ఇలాగే బయటకు పంపించారు. ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎందుకు అన్నది సీఎం కేసీఆర్ భావన. మంత్రులు ఎవరూ స్వేచ్ఛగా చేయలేరు. ఐఏఎస్ అధికారులు కూడా బాధతోనే పనిచేస్తున్నారు.

  తెలంగాణ ఉద్యమాన్ని విరమిస్తే రూ.50వేల కోట్లు ఇస్తామని ఆనాడు ఆంధ్రా నేతలు ఆఫర్ ఇచ్చారు. కానీ మేం తిరస్కరించాం. డబ్బుల కన్నా తెలంగాణ ఆత్మగౌరవమే ముఖ్యమని కొట్లాడాం. రాష్ట్రాన్ని సాధించాం.

  టీఆర్ఎస్ బీఫామ్ ఇచ్చినంత మాత్రాన అందరూ గెలవరు. కేసీఆర్‌కు కూతురుకు బీఫామ్ ఇచ్చినా నిజామాబాద్‌లో గెలవలేదు. నేను మాత్రం ఇప్పటి వరకు ఓడిపోలేదు.

  కేసీఆర్ తనకు మందులు అందించేందుకు సంతోష్‌ను రాజ్యసభ పదవి ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ను కలవకుండా తనన మూడు సార్లు అడ్డుకున్నారు. తాను మంత్రినని.. ఇంత దారుణంగా ఉంటుందా? అని ఓసారి ప్రశ్నించాను.

  బొగ్గ గని కార్మిక సంఘంలో ఆ సంఘానికి చెందిన నేతలు ఎవరూ లేరు. ఆయన కూతురు కవిత దాన్ని నడుపుతున్నారు. అలాంటి వ్యక్తులకు కార్మికులతో ఎలాంటి సంబంధాలుంటాయి? ఆర్టీసీ, సింగరేణి, ఎలక్ట్రిసిటీ సంఘాల్లో అంతా కల్వకుంట్ల కుటుంబ సభ్యులే ఉన్నారు.

  తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తొలి ముఖ్యమంత్రి దళితుడే ఉంటారని కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ అది జరగలేదు. అంతెందుకు సీఎంవో ఆఫీసులో ఒక్క దళిత, ఎస్టీ, బీసీ ఐఏఎస్ అధికారి కూడా లేరు.

  తెలంగాణ ఉద్యమ సమయంలో ఇందిరా పార్క్‌లో ఎన్నో ఉద్యమాలు చేశాం. కానీ ఇప్పడు ధర్నాచౌక్‌ను ఎత్తేసిన చరిత్ర వాళ్లది. ఇవన్నింటినీ మేం అడగకూడదా? ఇంత అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించకూడదా?

  నేనే పథకాన్ని విమర్శించలేదు. రైతు బంధు గురించి కొన్ని సూచనలు చేశా. ఆదాయపన్ను కట్టే వారికి రైతు బంధు ఇవ్వొద్దని చెప్పాను. వారు వ్యవసాయం చేయరు. ఆ డబ్బులను పేద రైతులకు ఇస్తే బాగుంటుందని సూచించా. ఇదేమైనా తప్పా?

  రెండేళ్లుగా చాలా మందికి పెన్షన్‌లు వస్తలేవు. సర్పంచ్, ఎంపీటీసీలు నా వద్దకు వచ్చారు. కానీ 'ఖచ్చితంగా నేను చేస్తా'.. అని చెప్పే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రికి చెబుతా..అని మాత్రమే చెప్పారు. తెలంగాణలో మంత్రుల పరిస్థితి ఇది.

  విద్యుత్, నీళ్ల సమస్య తీరిందని చెబుతున్నారు. కానీ గ్రామాలు బాగుపడకుండా బంగారు తెలంగాణ సాధ్యం కాదు.  ఇది కూడా చదవండి:

  Telangana: అది ప్రగతి భవన్‌ కాదు.. బానిసల నిలయం.. సీఎం కేసీఆర్‌పై ఈటల ఎదురుదాడి
  Published by:Shiva Kumar Addula
  First published: