Eetala Rajender: ఈటల రాజేందర్‌పై బీజేపీ ఫోకస్.. పార్టీలోకి ఆహ్వానం.. మరి ఆయన దారెటు?

మంత్రి ఈటల రాజేందర్ (ఫైల్)

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసేందుకు కూడా ఈటల ప్రయత్నించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై కిషన్ రెడ్డి కూడా స్పందించారు. తనను కలిసేందుకు ఈటల ప్రయత్నించిన మాట వాస్తవమేనని.. ఐతే ఇప్పటి వరకూ కలవలేదని పేర్కొన్నారు.

  • Share this:
    తెలంగాణలో కొన్ని రోజులుగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. భూకబ్జా ఆరోపణలతో ఆయన్ను మంత్రివర్గం నుంచి తప్పించారు సీఎం కేసీఆర్. మరి ఇప్పుడు ఈటల రాజేందర్ ఏం చేయబోతున్నారు? ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఇది వరకే చెప్పిన ఈటల.. కొత్త పార్టీ పెడతారా? లేదంటే వేరే పార్టీలో చేరతారా? అనేది ఉత్కంఠ రేపుతోంది. ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈటల రాజేందర్‌పై బీజేపీ దృష్టి సారించిందని.. పార్టీలోకి రావాల్సిందిగా ఆయనకు ఆహ్వానం అందిందని తెలుస్తోంది. భవిష్యత్ కార్యాచరణలో భాగంగా కొన్ని రోజులుగా ఆయన పలు పార్టీలకు చెందిన నేతలను కలుస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ ముఖ్య నేతలతోనూ మంతనాలు జరిపారు.


    బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాలు పలువురు ముఖ్య నేతలతో ఈటల సమావేశమయ్యారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత.. ఉపఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానని, తనకు మద్దతు ఇవ్వాలని బీజేపీ నేతలను ఆయన కోరారు. ఐతే బీజేపీ నేతలు మాత్రం పార్టీలో చేరాలని సూచించారట. బీజేపీలో చేరితే.. రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని చెబుతున్నారు. ఒక జాతీయ పార్టీగా ఉపఎన్నికల్లో బీజేపీ పోటీ చేయకుండా ఉండలేదని బండి సంజయ్ చెప్పినట్లు సమాచారం. పోటీ చేయకుండా ఉండాలంటే.. రాష్ట్ర నేతలతో పాటు జాతీయ నేతల అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారట.


    సోమవారం రాత్రి మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్‌ వెంకటస్వామి తన వ్యవసాయ క్షేత్రంలో ఈటల రాజేందర్‌తో సమావేశమయ్యారు. బీజేపీలోకి రావాల్సిందిగా ఆహ్వానించినట్లు సమాచారం. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఆయన నేరుగా అక్కడకు వచ్చి రాజేందర్‌తో మాట్లాడినట్లు తెలిసింది. మరోవైపు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసేందుకు కూడా ఈటల ప్రయత్నించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై కిషన్ రెడ్డి కూడా స్పందించారు. తనను కలిసేందుకు ఈటల ప్రయత్నించిన మాట వాస్తవమేనని.. ఐతే ఇప్పటి వరకూ కలవలేదని పేర్కొన్నారు. భవిష్యత్ కార్యాచరణ కోసం ఇతర పార్టీల నేతలను కలుస్తున్నానని.. అలాగే తనత కలుస్తానని ఈటల పేర్కొనట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఈటల రాజీనామా తర్వాత.. హుజురాబాద్ ఉపఎన్నికలు వస్తే, బీజేపీ పోటీ చేయాలా? వద్దా? అనే దానిపై ఇంకా చర్చించలేదని ఆయన చెప్పారు.

    ప్రస్తుతానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగానే ఉపఎన్నికల్లో పోటీ చేయాలని ఈటల రాజేందర్ భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు కొత్త పార్టీని పెడతారన్న ఊహగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈటల పెట్టబోయే కొత్త పార్టీ బీసీల వేదికగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పటి వరకు దానిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. మరోవైపు బీజేపీ మాత్రం ఈటల రాజేందర్‌పై ఫోకస్ పెట్టింది. తెలంగాణలో బలమైన నేతగా పేరు ఈటల రాజేందర్.. తమ పార్టీలోకి వస్తే ఇటు పార్టీకి, అటు ఈటలకు కూడా కలిసి వస్తుందని కమలం పార్టీ నేతలు యోచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈటల రాజేందర్ ఏం చేయబోతున్నారు? ఇండిపెండెంట్‌గా పోటీచేస్తారా? లేదంటే బీజేపీలోకి వెళ్తారా? అనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరోవైపు ఈ పరిణామాలను టీఆర్ఎస్ కూడా ఆసక్తిగా గమనిస్తోంది.
    Published by:Shiva Kumar Addula
    First published: