Eetala Rajender: ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై ఈటల క్లారిటీ.. ఎప్పుడు చేస్తారంటే..

ఈటల రాజేందర్ (ఫైల్)

ఎమ్మెల్యే పదవికి ఎప్పుడు రాజీనామా చేస్తారన్న దానిపై ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం కరోనా వేళ ప్రజలు ఇబ్బందులో ఉన్నారని.. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేయవద్దని అన్నారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత ఖచ్చితంగా రాజీనామా చేస్తానని చెప్పారు.

 • Share this:
  తెలంగాణలో ఈటల రాజేందర్ వ్యవహారం కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా మారింది. తన ఫౌల్ట్రీ కంపెనీ కోసం భూములను కబ్జా చేశారని ఆరోపణలు రావడం, వెంటనే విచారణ కమిటీ వేయడం, ఆరోగ్యశాఖ నుంచి తప్పించడం, కేబినెట్ నుంచి బర్తరఫ్ నుంచి చేయడం.. చకచకా జరిగిపోయాయి. భూముల కబ్జా వ్యవహారంపైనా అంతే స్పీడులో విచారణ జరిగింది. ఈటల నిజంగానే భూములను కబ్జా చేశారని సీఎంకు రిపోర్టులు కూడా అందాయి. ఐతే ఈటల రాజేందర్ మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని.. తనపై పక్కా పథకం ప్రకారం కుట్ర చేశారని మండిపడ్డారు. తన ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని.. తాను తప్పుచేసినట్లు రుజువైతే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఐతే ఇంత జరిగినా ఎమ్మెల్యే పదవికి ఆయన ఎందుకు రాజీనామా చేయడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రాజీనామాపై ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు.

  ''ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికి తెలుసు. మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు, ఇతర రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. మనుషులు చనిపోతున్న తరుణంలో ఇప్పుడు రాజీనామా చేసి ఈ క్రీడ ఆడవద్దని అనుకుంటున్నా. కరోనా సంక్షోభం ముగిసిపోయిన తర్వాత రాజీనామా చేస్తా. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి తేల్చుకుంటా. నేను భయపడే బిడ్డను కాదు. భయపడే వాడినైతే అక్కడే అడ్జస్ట్ అయ్యే వాడిని. పదవి కంటే ఆత్మగౌరవమే నాకు ఉన్నతమైనది.'' అని తీన్మార్ మల్లన్నకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు ఈటల రాజేందర్.

  మెదక్ జిల్లా మాసాయిపేట మండలం హకీంపేట, అచ్చంపేట గ్రామాల్లో భూముల కబ్జా జరిగినట్టు దర్యాప్తు కమిటీ నిగ్గు తేల్చిన విషయం తెలిసిందే. జమున హేచరిస్ ఆధీనంలో అక్రమంగా 66 ఎకరాల భూములు ఉన్నట్టు గుర్తించారు. వీటిలో అనుమతి లేకుండా అసైన్డ్ భూముల్లో చెట్లను తొలగించారని నివేదికలో పేర్కొన్నారు. అనుమతి లేకుండా జమున హేచరీస్ పౌల్ట్రీ షెడ్డులు నిర్మించారని.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను ఎగవేశారని నివేదికలో తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఐతే ఈ వ్యవహారంపై ఈటల హైకోర్టును ఆశ్రయించారు.

  విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈటల వ్యవహారానికి సంబంధించిన మే 1, 2 తేదీల్లో మెదక్ కలెక్టర్ హరీశ్ విచారణ చేపట్టి ఇచ్చిన నివేదిక చెల్లదని పేర్కొంది. ఈ నివేదికను పరిగణనలోకి తీసుకోవద్దని స్పష్టం చేసింది. నోటీసులు ఇచ్చి నిబంధనల ప్రకారం సమయం ఇవ్వాలని సూచించింది. వెనుక గేటు నుంచి కాకుండా రాజమార్గంలో వెళ్లి విచారణ చేయాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలో ఈటలకు కాస్త ఊరట కలిగినట్లయింది. ఐతే తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ ప్రస్తుతం ఎలాంటి అడుగు ముందుకు వేస్తారన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
  Published by:Shiva Kumar Addula
  First published: