Telangana: హుజురాబాద్‌లో కొత్త రాజకీయం.. టీఆర్ఎస్‌కు ఈటల వర్గం వరుస షాక్‌లు

మంత్రి ఈటల రాజేందర్ (ఫైల్)

టీఆర్ఎస్ సమావేశానికి వెళ్తున్న ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ కాన్వాయ్‌ను ఈటల అనుచరులు అడ్డుకున్నారు. ఆయన్ను అడ్డుకొని 'జై ఈటల' అంటూ నినాదాలు చేేశారు. ఈటల విషయంలో తమ అభిప్రాయాలను ఎందుకు పరిగణలోకి తీసుకోడం లేదని మండిపడుతున్నారు

  • Share this:
    ఈటల రాజేందర్ ఇలాఖా హుజురాబాద్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎమ్మెల్యే పదవికి ఈటల ఇంకా రాజీనామాకు చేయకముందే.. అప్పుడే రచ్చ జరుగుతోంది. టీఆర్ఎస్ వర్గం, ఈటల వర్గం మధ్య రోజుకో గొడవ తెరపైకి వస్తోంది. ఈటలకు చెక్‌పెట్టేందుకు టీఆర్ఎస్ హైకమాండ్ ఆపరేషన్ హుజురాబాద్ ప్రారంభించిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఈటల వెంట వెళ్లకుండా ఉండేందుకు నేతలను రంగంలోకి దింపింది. ఇప్పటికే మంత్రులు గంగుల కమలాకర్, హరీష్ రావు హుజురాబాద్ నేతలతో మాట్లాడారు. ఇప్పుడు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఐతే ఆయనకు ఈటల వర్గం నుంచి అడుగడుగునా నిరసనలే ఎదురవుతున్నాయి.

    నిన్న వీణవంక ఘటనను మరవక ముందే నేడు చల్లూరులోనూ ఈటల అభిమానులు ఆందోళన చేశారు. టీఆర్ఎస్ సమావేశానికి వెళ్తున్న ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ఆయన్ను అడ్డుకొని 'జై ఈటల' అంటూ నినాదాలు చేేశారు. ఈటల విషయంలో తమ అభిప్రాయాలను ఎందుకు పరిగణలోకి తీసుకోడం లేదని మండిపడుతున్నారు. ప్రజల్లో ఎంతో మంచి పేరున్న ఈటలపై కుట్రపూరితంగానే ఆరోపణలు చేశారని ఆయన అనుచరులు విమర్శిస్తున్నారు. ఆయన్ను ఎందుకు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికీ ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌లోనే ఉన్నారని.. దమ్ముంటే ఆయన్ను పార్టీలో నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలంతా ఈటల వెంటే ఉన్నారని స్పష్టం చేస్తున్నారు.

    శనివారం వీణవంకలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ సమావేశం కూడా రసాభాసగా మారింది. ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఈటల వెంట ఎవరూ వెళ్లవద్దని కోరారు. వ్యక్తులు ముఖ్యం కాదు పార్టీయే ముఖ్యమని అన్నారు. నారదాసు లక్ష్మణ్ ఆ వ్యాఖ్యలు చేయగానే.. కొందరు కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మొన్నటి వరకు ఈటల వెంటే ఉండి, ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడతారా...? అని నిలదీశారు. జై ఈటల అంటూ నినాదాలు చేశారు. ఈటల అనుకూల నినాదాలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. దాంతో వేదికపై ఉన్న ఎమ్మెల్సీ లక్ష్మణ్ షాక్ తిన్నారు. ఈటలకు అనుకూలంగా నినాదాలు చేసిన వారిని టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దాంతో సభ రసాభాసగా మారింది. పోలీసులు కల్పించుకొని వారిని బయటకు పంపించారు.

    హుజురాబాద్‌లో టీఆర్ఎస్ కార్యర్తలు చేజారిపోకుండా ఉండేందుకు ఆ పార్టీ వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. మండలాల వారీగా కార్యకర్తలతో భేటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఐతే ఆ సమావేశాలను అడ్డుకునేందుకు ఈటల రాజేందర్ అనుచురులు ప్రయత్నం చేస్తున్నారు. నేతలను అడ్డగించి.. తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాగా, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరేందుకు సర్వం సిద్ధమయింది. ఒకటి రెండు రోజుల్లోనే ఆయన ఢిల్లీకి వెళ్లి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. అనంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈటలను రాజ్యసభకు పంపించి, కేంద్రమంత్రి పదవి ఇస్తారని.. హుజురాబాద్‌లో ఆయన భార్య జమున బీజేపీ తరపున బరిలోకి దిగుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published: