news18-telugu
Updated: August 26, 2019, 7:38 PM IST
తెలంగాణ సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)
ఆర్థిక మాంద్యం ప్రభావం దేశ వ్యాప్తంగా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన జరగాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గత మార్చిలో ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశ పెట్టిన నేపథ్యంలో 2019-20 ఆర్థిక సంవత్సరం పూర్తిస్థాయి బడ్జెట్ ను త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నట్లు సిఎం ప్రకటించారు. బడ్జెట్ రూపకల్పనపై ముఖ్యమంత్రి కేసీఆర్ సీనియర్ అధికారులతో కలిసి సోమవారం ప్రగతి భవన్ లో కసరత్తు చేశారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, ఇతర ఆర్థిక శాఖ ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
దేశ వ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక మాంద్యం నెలకొని ఉందని... అన్ని రంగాలపై దీని ప్రభావం పడిందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఆదాయాలు బాగా తగ్గిపోయాయని అన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఆదాయం తగ్గిందని... ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ఆదాయం,అవసరాలను బేరీజు వేసుకుని బడ్జెట్ రూపకల్పన జరగాలని కేసీఆర్ వారికి సూచించారు. వాస్తవ దృక్పథంతో బడ్జెట్ తయారు చేయాలని... ప్రజా సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూనే, ఇతర రంగాలకు అవసరమైన మేర కేటాయింపులుండేలా చూడాలని అధికారులకు సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. బడ్జెట్ రూపకల్పనపై మంగళవారం కూడా కసరత్తు జరుగనుంది. తుది రూపం వచ్చిన తర్వాత మంత్రివర్గ ఆమోదం తీసుకుని... అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెడతారు.
Published by:
Kishore Akkaladevi
First published:
August 26, 2019, 7:38 PM IST