తిరుపతి, నాగార్జునసాగర్ ఉపఎన్నికలు ఎప్పుడు? నేడు తేదీలు ప్రకటించనున్న ఈసీ

(ప్రతీకాత్మక చిత్రం)

సాయంత్రం నాలుగున్నర గంటలకు కేంద్రం ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరితో పాటు తిరుపతి, నాగార్జున సాగర్ ఉపఎన్నికలకు కూడా షెడ్యూల్ విడుదల చేయనుంది.

 • Share this:
  తెలుగు రాష్ట్రాల్లో వరుసగా ఎన్నికల కోలాహలం నెలకొంది. పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలతో ఏపీలో కొన్ని నెలలగా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎమ్మెల్సీ ఎన్నికలతో తెలంగాణ పాలిటిక్స్ కూడా వేడెక్కుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరో ఎన్నికల నగారా మోగబోతోంది. తెలంగాణలో నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉపఎన్నికతో పాటు ఏపీలో తిరుపతి లోక్‌సభ ఎన్నికలకు నేడు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. సాయంత్రం నాలుగున్నర గంటలకు కేంద్రం ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరితో పాటు ఉపఎన్నికలకు కూడా షెడ్యూల్ విడుదల చేయనుంది.

  నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమయ్యింది. కాంగ్రెస్ నుంచి జానారెడ్డి బరిలోకి దించాలని ఆ పార్టీ నిర్ణయించింది. టీఆర్ఎస్ పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటంచలేదు. నోముల నర్సింహయ్య తనయుడు నోముల భ‌గ‌త్‌కు టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ ఆయన అభ్యర్థిత్వంపై టీఆర్ఎస్ పెద్దలు ఆసక్తి చూపడం లేదని సమాచారం. ఇక స్థానికంగా ఉంటున్న కోటిరెడ్డికి ఇవ్వాలని మంత్రి జగదీష్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారట. మరోవైపు నోముల‌కు బంధువైన ఉస్మానియా యూనివ‌ర్సిటీ విద్యార్థి సంఘం నేత బాల‌రాజు యాద‌వ్ సైతం త‌న ప్రయ‌త్నాలు చేస్తున్నారు.

  బీజేపీ కూడా దుబ్బాక ఎన్నిక మాదిరే.. ఇక్కడా సత్తా చాటాలని ప్లాన్ చేస్తోంది. మరో విజయాన్ని తమ ఖాతాల్లో వేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. నాగార్జునసాగర్‌లో బీసీ నేతగా పేరున్న కడారి అంజయ్యయాదవ్ వైపు బీజేపీ మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. కడారి అంజయ్య 2019 ఆగస్టులో బీజేపీలో చేరారు. అప్పటి నుంచీ నియోజకవర్గంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. కడారి అంజయ్యతో పాటు నల్లగొండ బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి భార్య నివేదితారెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిస్తోంది. ఐతే వీరిద్దరిలో కడారి అంజయ్యకే బీజేపీ హైకమాండ్ జైకొడుతున్నట్లు సమాచారం అందుతోంది.

  తిరుపతి విషయానికొస్తే.. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు ఇప్పటికీ టీడీపీ, వైసీపీ అభ్యర్థులను ఖరారు చేశాయి. టీడీపీ నుంచి పనబాక లక్ష్మి, వైసీీపీ నుంచి డాక్టర్ గురుమూర్తిని బరిలోకి దిగుతున్నారు. ఇక జనసేన-బీజేపీలో మిత్రపక్షాలుగా ఉన్న నేపథ్యంలో.. ఎవరు పోటీచేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. మొదటి నుంచీ తిరుపతిపై బీజేపీ నేతలు కన్నేయడంతో.. ఆ పార్టీయే అభ్యర్థిని రంగంలోకి దింపుతుందని అందరూ భావించారు. కానీ జనసేన తామూ రేస్‌లో ఉన్నామని ముందుకొచ్చింది. మరి ఈ కూటమిలో ఎవరు పోటీచేస్తారన్నది తెలియాల్సి ఉంది.
  Published by:Shiva Kumar Addula
  First published: