ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్‌కు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. కేజ్రీవాల్ కు ఎన్నికల సంఘం అధికారులు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. కేజ్రీవాల్ తన ట్విట్టర్ ఖాతా వేదికగా పోస్ట్ చేసిన ఓ వీడియోపై అభ్యంతరం తెలుపుతూ ఈ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. ఎన్నికల కోడ్ ఉల్లంఘించేలా ఈ వీడియో ఉందని ఆరోపించారు. శనివారంలోగా సమాధానం ఇవ్వాలని కేజ్రీవాల్ ని ఈసీ అధికారులు ఆదేశించినట్టు సమాచారం.
మరోవైపు ఇవాళ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సారి ఎన్నికల బరిలో మొత్తం 668 మంది అభ్యర్థులు ఉన్నారు. 1.47 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయబోతున్నారు 13,750 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఆసక్తికర విషయమేంటంటే... ఈసారి ఎలాగైనా గెలవాలని బీజేపీ... ఏకంగా 240 మంది ఎంపీలు, 59 మంది కేంద్ర మంత్రులు, 11 రాష్ట్రాల సీఎంలు, వెయ్యి మంది బీజేపీ కార్యకర్తల్ని రంగంలోకి దింపి భారీ ప్రచారం సాగించింది. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కొందరు సీనియర్ నేతలు ప్రచారం చేశారు. అనారోగ్యం వల్ల పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున కన్వీనర్, సీఎం కేజ్రీవాల్, పార్టీ కీలక నేతలు ప్రచారం సాగించారు. ఐతే... ఆప్ ఎక్కడా బీజేపీని ఇతర పార్టీలనూ టార్గెట్ చెయ్యలేదు. తమ పథకాలు, తాము చేసిన పనులను మాత్రమే చెబుతూ వచ్చింది. 2015లో ఇదే ఆప్... 67 అసెంబ్లీ స్థానాలు గెలవగా... బీజేపీ 3 గెలిచింది. ఈసారి ఆప్ ఎన్ని గెలుస్తుంది? బీజేపీకి ఎన్ని దక్కుతాయి అన్నదానిపై ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇవాళ పోలింగ్ ముగిశాక... 11న ఫలితాలు వస్తాయి.
Published by:Sulthana Begum Shaik
First published:February 08, 2020, 08:11 IST