చివరి వరకు సస్పెన్స్. తెరపైకి వచ్చేంత వరకు అంతా రహస్యమే. అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్ అంటూ కేంద్ర ప్రకటన ఒక్కసారిగా అందర్నీ షాక్‌కు గురిచేసింది. ఓబీసీ రిజర్వేషన్ల కోటా పెంపు డిమాండ్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్న పరిస్థితుల్లో వాటి ప్రస్తావనే లేకుండా అకస్మాత్తుగా మోదీ సర్కార్ ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్ అంటూ... ఏకంగా బిల్లు పార్లమెంట్లో ఆమోదానికి పెట్టింది. దేశ చరిత్రలోనే తొలిసారిగా కేవలం 72 గంటల్లో ఈబీసీ రిజర్వేషన్ బిల్లును పాస్ చేసింది. దీంతో ఇప్పుడు ఈ అంశమే రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ ప్రకటించడంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత రహస్యంగా వ్యవహరించింది. ఏమాత్రం సమాచారం బయటకు పొక్కకుండా మరో సర్జికల్ స్టైక్‌కు దిగింది. కేబినెట్ ఆమోదానికి ముందు సమాచారం బయటకు రాకుండా సైనిక వ్యవహారాల మాదిరిగా సీక్రెసీ మెంటైన్ చేసింది. ప్రధాని మోదీ అధికారిక నివాసంలో సోమవారం జరిగిన మంత్రివర్గ ప్రత్యేక సమావేశానికి మూడు రోజుల ముందే కేబినెట్ నోట్‌ను సిద్ధం చేశారు. అయితే అందులో కోటా బిల్లును ప్రస్తావించలేదు. సమావేశ ప్రారంభానికి ముందు చివరి క్షణాల్లో ప్రతిపాదనను చేర్చారు.
సోమవారం క్యాబినెట్ సమావేశానికి ముందు, మోదీ ఆర్థిక, న్యాయ, న్యాయ మంత్రిత్వ శాఖలలో ఉన్నత అధికారులతో రెండు రౌండ్ల సమావేశాలు నిర్వహించారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో 10 శాతం రిజర్వేషన్ బిల్లు సాధ్యసాధ్యాలపై ప్రధాని చర్చించారు. సోమవారం ఉదయం జరిగిన అత్యవసర కేబినెట్ సమావేశంపై కార్యదర్శి సిన్హాతో పాటు అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.కె. మిశ్రకు కూడా ప్రధాని సమాచారమందించారు. అయితే సమావేశానికి ముందు అంతా తమ ఎజెండా పత్రాలు వెనక్కి తీసుకున్నారు. దీంతో కొత్త ఆర్థిక అంశాలు, రాఫెల్ వివాదాం, రక్షణ సమస్యలకు సంబంధించి అత్యవసర సమావేశంలో చర్చిస్తారని ఊహించారు. జైట్లీ, అమిత్ షాకు తప్ప, కేంద్ర మంత్రుల్లో ఎవరికి కూడా క్యాబినెట్ సమావేశంలో ఏ విషయంపై చర్చ జరుగుతుందన్న దానిపై క్లారిటీ లేదు.
కేబినెట్ సమావేశం ప్రారంభంకావడంతో 10 శాతం రిజర్వేషన్ కోటా అంశాన్ని మోదీ ప్రస్తావించారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లు ప్రవేశ పెట్టి ఆమోదించాలన్నారు. అంతేకాకుండా బిల్లుకు సంబంధించిన అంశాలపై వ్యూహాలు కూడా ఆయన రూపొందించినట్లుగా చెప్పుకొచ్చారు. కొత్త రిజర్వేషన్ కోటా ఎలా ఉంటుందన్న విషయాల్ని కూడా మోదీ అధికారులకు, మంత్రులకు వివరంచారు. ఇలా బిల్లు పెట్టి అలా పాస్ చేయించారు మోదీ. ఓ గేమ్ ఛేంజర్‌లా మరోసారి తన మార్క్ చూపించారు. ఈ విషంయలో ప్రతిపక్షాలు సైతం మోదీ మనసులో ఏముందో పసిగట్టలేకపోయాయి. కేవలం 72 గంటల్లోనే పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యేలా పక్కా ప్లాన్ చేశారు.
మోదీ తీసుకున్న ఈ చారిత్రక నిర్ణయం ఒక్కసారిగా బీజేపీకి మరింత బూస్ట్ ఇచ్చినట్లైంది. మోదీ నాయకత్వం ఇప్పుడు తెలిసిందా ?అంటూ షా తమ పార్టీ నేతలను ప్రశ్నించారు. కేవలం 72 గంటల్లో ఆయన రాజకీయాల్ని మలుపు తిప్పేశారు. సర్జికల్ స్ట్రైక్, నోట్ల రద్దు, ప్రధాని లాహోర్ పర్యటన వీటిన్నంటిలో మోదీ మార్క్ ఉంది. 2019 ఎన్నికలకోసం మోదీ తీసుకున్న పదిశాతం రిజర్వేషన్ల అంశం కేవలం ప్రారంభం మాత్రమే అంటూ షా,... కేంద్రమంత్రి పియూష్ గోయల్ వద్ద ప్రస్తావించారు.
మరోవైపు అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్ ఎన్నికలకు ముందు ఎక్కుపెట్టిన బ్రహ్మస్త్రంగా భావిస్తున్న ఈ రిజర్వేషన్ ప్రతిపాదన ఇప్పటికిప్పుడు వచ్చిందేమీ కాదు. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈబీసీ) రిజర్వేషన్ కోసం ఓ కేటగిరీని రూపొందించాలని 2010లో ఎస్.ఆర్.సిన్హో కమిషన్ సిఫార్సు చేసింది. తద్వారా ఈబీసీలకు ఇతర వెనుకబడిన తరగతుల(ఓబీసీ) తరహాలో ప్రయోజనాలు చేకూరుతాయని సూచించింది. 2013లో కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ఈ అంశంపై చర్చ జరిగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: EBC Reservation, Narendra modi, Pm modi