వంశవాదాన్ని నిలువరించాలనే ఉద్దేశంతోనే ఎంపీల వారసులకు అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వలేదని, బీజేపీలో టికెట్ల నిరాకరణకు పూర్తి బాధ్యుడిని తానేనని మోదీ పేర్కొన్నారు.
వంశవాదం ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వంశవాద రాజకీయాలను అంతం చేయాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా కలిసికట్టుగా పోరాడుదామని బీజేపీ నేతలకు సూచించారు. వంశవాదాన్ని నిలువరించాలనే ఉద్దేశంతోనే ఎంపీల వారసులకు అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వలేదని, బీజేపీలో టికెట్ల నిరాకరణకు పూర్తి బాధ్యుడిని తానేనని మోదీ పేర్కొన్నారు. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ మేరకు ప్రధాని కీలక దిశానిర్దేశం చేశారు.
రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకాగా, రెండోరోజైన మంగళవారం నాడు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ భేటీకి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, ప్రహ్లాద్ జోషి, అన్ని రాష్ట్రాల ఎంపీలు, పార్టీ కీలక నేతలు హాజరయ్యారు. ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన నాలుగు రాష్ట్రాల్లో తిరిగి విజయం సాధించిన దరిమిలా పార్టీనేతలు ప్రధాని మోదీని సన్మానించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..
ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైన వంశవాద రాజకీయాలకు బీజేపీ అతీతంగా ఉండాలని, ఇతర పార్టీల్లోనూ వంశవాద రాజకీయాలను నిరసనించాల్సిందేనని, డైనెస్టీకి వ్యతిరేకంగా పోరాడాల్సిందేనని ప్రధాని మోదీ అన్నారు. ‘మన పార్టీలో కుటుంబ రాజకీయాలకు తావులేదు. అందుకే ఎంపీల వారసులకు అసెంబ్లీలో అవకాశం కల్పించలేదు. ఎవరిదైనా అభ్యర్థిత్వం తిరస్కరిరణకు గురైందంటే అది పూర్తిగా నా బాధ్యతే. ఇతర పార్టీల్లో వంశపారంపర్య రాజకీయాలపైనా మనం పోరాడాలి’అని మోదీ స్పష్టం చేశారు.
పార్టీ ఎంపీలు వంశవాద రాజకీయాలకు దూరంగా ఉండాలని ఉద్భోదించడంతోపాటు సమకాలీన అంశాలపైనా ప్రధాని మోదీ మాట్లాడారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని గుర్తుచేస్తూ, ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించిన, తరలిస్తోన్న విధానాన్ని ఎంపీలకు మోదీ వివరించారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.