news18-telugu
Updated: November 9, 2020, 8:08 PM IST
ప్రతీకాత్మక చిత్రం
బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా దేశవ్యాప్తంగా పలు నియోజకవర్గాల ఉప ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో ఈ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా బిహార్ ఫలితాలపై చాలా ఉత్కంఠ నెలకొంది. బీహార్ అసెంబ్లీలో 243 సీట్లకు మొత్తం మూడు దశల్లో ఎన్నికల్లో జరిగాయి. అక్కడ ఓవైపు ఎన్డీయే కూటమి(బీజేపీ,జేడీయూ), మరోవైపు ఆర్జేడీ, కాంగ్రెస్‌లు మహాకూటమిగా బరిలో నిలిచాయి. తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ చూస్తుండగా.. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆర్జేడీ యువనాయకుడు తేజస్వీ గట్టిగానే ప్రయత్నించారు.
బిహార్‌లో పోలింగ్ ముగిసిన అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్.. ఫలితాలపై మరింత ఆసక్తిని పెంచాయి. బీజేపీ - జేడీయూ కూటమికి, ఇటు ఆర్జేడీ - కాంగ్రెస్ మహాకూటమికి కూడా పోటాపోటీగా సీట్లు వస్తాయని పలు సర్వేలు చెప్పాయి. అయితే మహాకూటమికి కొద్దిపాటి అడ్వాంటేజ్ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ గణంకాలు చెబతున్నాయి. అయితే రిపబ్లిక్ జన్ కీ బాత్ సర్వే మాత్రం ఆర్జేడీ సారధ్యంలోని మహాకూటమి అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. ఈ క్రమంలోనే బిహార్ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారా? లేక హంగ్ ఏర్పడుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై చాలా ఉత్కంఠ నెలకొంది.ఇక్కడ 23 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అందులో ప్రధానంగా టీఆర్ఎస్ అభ్యర్థిగా రామలింగారెడ్డి సతీమణి సుజాత, బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస రెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి కత్తి కార్తీక బరిలో ఉన్నారు. ఇక్కడ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఎన్నికల ప్రచారం సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు.. ఫలితాలపై మరింత ఉత్కంఠను పెంచాయి.
ఇక, అటు బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, ఇటు దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలకు సంబంధించిన మినిట్ టూ మినిట్ అప్డేట్ను మీకు అందించేందుకు న్యూస్18 తెలుగు సిద్ధంగా ఉంది. ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల ఫలితాలకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ కోసం న్యూస్18 తెలుగును ఫాలో అవ్వండి.
Published by:
Sumanth Kanukula
First published:
November 9, 2020, 6:40 PM IST