Dubbaka By-Elections: దుబ్బాకకు తరలుతున్న నోట్ల కట్టలు.. భారీగా నగదు పట్టివేత
నగదు స్వాధీనం చేసుకుంటున్న పోలీసులు
Dubbaka By-Elections: ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన దుబ్బాక ఎన్నికల్లో నగదు ప్రవాహం జోరుగా సాగుతోన్నట్లు సమాచారం. ఎన్నికల నేపథ్యంలో పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోంది.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయం అంతా దుబ్బాక ఉప ఎన్నికల చుట్టూనే తిరుగుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సొంత స్థానాన్ని నిలబెట్టుకుని తమకు రాష్ట్రంలో తిరుగులేదని మరో సారి చాటాలని అధికార టీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతోంది. దుబ్బాకపై కాషాయ జెండా ఎగురవేసి.. 2023 ఎన్నికల్లో రాష్ట్రంలో తాము అధికారంలోకి రాబోతున్నామనే సంకేతాలు ఇవ్వాలని బీజేపీ నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరో వైపు కాంగ్రెస్ సైతం గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతోంది. ఇప్పటికే టీఆర్ఎస్ ముఖ్యనేత చెరుకు శ్రీనివాస్ రెడ్డికి కండువా కప్పిన హస్తం నేతలు.. ఆయనను తమ అభ్యర్థిగా ప్రకటించారు. రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన ఈ ఎన్నికల్లో నగదు ప్రవాహం సైతం జోరుగా సాగుతోంది. ఇటీవల శామీర్ పేట వద్ద పట్టుబడిన రూ. 40 లక్షలు దుబ్బాకకు తరలిస్తున్నవే అని పోలీసులు గుర్తించడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా భూంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్బర్ పేట చౌరస్తాలో ఈరోజు ఉదయం నిర్వహించిన వాహన తనిఖీల్లో మరో రూ. 2 లక్షలను పోలీసులు పట్టుకున్నారు. ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో ఆ నగదును సీజ్ చేశారు. డబ్బు తరలిస్తున్న వ్యక్తిని ములుగు జిల్లా, సింగరకుంటకు చెందిన సీహెచ్ రాజేందర్ గా గుర్తించారు. ఈ డబ్బులకు దుబ్బాక ఎన్నికలకు సంబంధం ఉందా? లేదా? అన్న విషయం తేలాల్సి ఉంది. ఈ సందర్భంగా ఏసీపీ బాలాజీ మాట్లాడుతూ.. దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. ఎవరూ రూ. 50 వేలకు మించి డబ్బులను వెంట తీసుకువెళ్లవద్దని సూచించారు. అంతకు మించి డబ్బులు తీసుకెళ్తే సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.
ఇటీవల హైదరాబాద్ శివారులోని శామీర్పేట్లో ఓ వ్యక్తి వద్ద రూ.40 లక్షలు పట్టుబడడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఐతే ఆ డబ్బు గుట్టును పోలీసులు బయటపెట్టారు. ఔటర్ రింగ్ రోడ్డుపై పట్టుబడిన నగదు.. దుబ్బాక ఉపఎన్నికల్లో పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు సంబంధించినదని సైబరాబాద్ - బాలానగర్ డీసీపీ పద్మజ వెల్లడించారు. ఉపఎన్నికల్లో ఖర్చు చేసేందుకే భారీగా డబ్బును తరలిస్తున్ననట్లుగా గుర్తించామని చెప్పారు. ఈ అంశంపై బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు స్పందించారు. డాక్యుమెంట్లను చూడకుండా ప్రస్తుతం తాను ఏమీ చెప్పలేనని అన్నారు. ఫోన్ కాల్స్ సంభాషణ ఆధారంగా డబ్బు తరలింపు విషయం తెలిసినట్లు పోలీసులు చెబుతున్నారని.. నా ఫోన్ను తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేసిందా? అని ప్రశ్నించారు. ఈ అంశంపై కేంద్రహోంశాఖకు ఫిర్యాదు చేశానని వెల్లడించారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.