• HOME
 • »
 • NEWS
 • »
 • POLITICS
 • »
 • DUBBAKA BY POLLS RS 40 LAKH CASH SEIZED COPS CLAIM IT BELONGS TO BJP LEADER RAGHUNANDAN RAO AIDES SK

Dubbaka By election: పట్టుబడిన ఆ డబ్బు వారిదే.. దుబ్బాక ఎన్నికల్లో పంచేందుకే..

Dubbaka By election: పట్టుబడిన ఆ డబ్బు వారిదే.. దుబ్బాక ఎన్నికల్లో పంచేందుకే..

ప్రతీకాత్మక చిత్రం

ఫోన్ కాల్స్ సంభాషణ ఆధారంగా డబ్బు తరలింపు విషయం తెలిసినట్లు పోలీసులు చెబుతున్నారని.. నా ఫోన్‌ను తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేసిందా? అని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఈ అంశంపై కేంద్రహోంశాఖకు ఫిర్యాదు చేశానని వెల్లడించారు.

 • Share this:
  హైదరాబాద్ శివారులోని శామీర్‌పేట్‌లో ఓ వ్యక్తి వద్ద రూ.40 లక్షలు పట్టుబడడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఐతే ఆ డబ్బు గుట్టును పోలీసులు బయటపెట్టారు. ఔటర్ రింగ్ రోడ్డుపై పట్టుబడిన నగదు.. దుబ్బాక ఉపఎన్నికల్లో పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు సంబంధించినదని సైబరాబాద్‌ - బాలానగర్‌ డీసీపీ పద్మజ వెల్లడించారు. ఉపఎన్నికల్లో ఖర్చు చేసేందుకే భారీగా డబ్బును తరలిస్తున్ననట్లుగా గుర్తించామని చెప్పారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. పటాన్‌చెరు నుంచి ఓఆర్ఆర్ మీదుగా సిద్దిపేటకు నగదు తరలిస్తున్నారని సమాచారం అందింది. రంగంలోకి దిగిన సైబరాబాద్‌ ఎస్‌వోటీ, స్థానిక పోలీసుల.. శామీర్‌పేట ఓఆర్‌ఆర్‌ టోల్‌గేట్‌ వద్ద సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు.

  ఐతే పోలీసులను చూసి ఓ కారు వెనక్కి మళ్లి వెళ్లిపోయింది. వెంటనే సిబ్బంది ఆ కారును వెండించారు. కారు దిగిన డ్రైవర్ శ్రీనివాస్ బాబు ఓ సంచితో సర్వీస్ రోడ్డు మీది నుంచి పారిపోయేందుకు పరుగులు తీశారు. అతడి పట్టుకొని బ్యాగును పరిశీలించగా రూ.40 లక్షల నగదు బయటపడింది. వారి నుంచి నగదుతో పాటు రెండు వాహనాలు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కారు డ్రైవర్ శ్రీనివాస్ బాబు (39)తో పాటు మాజీద్‌ హుస్సేన్‌(43), సురేశ్‌(40), భవానీ ఆంజనేయులు(42)ను అదుపులోకి తీసుకున్నారు. వారి సెల్‌ఫోన్ల కాల్‌డేటాలో రఘునందన్‌రావు, ఆయన పీఏ రాచమల్ల సంతోష్ గౌడ్‌ నంబర్లను గుర్తించారు. నిందితులను విచారించగా తాము రఘునందన్‌రావు అనుచరులమని ఒప్పుకున్నట్లు డీసీపీ పద్మజ వెల్లడించారు. సిద్దిపేటలోని రఘునందన్‌రావు బంధువులకు ఇచ్చేందుకు నగదు తీసుకెళ్తున్నట్లు చెప్పారని ఆమె పేర్కొన్నారు.

  దీనిపై బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు స్పందించారు. డాక్యుమెంట్లను చూడకుండా ప్రస్తుతం తాను ఏమీ చెప్పలేనని అన్నారు. ఫోన్ కాల్స్ సంభాషణ ఆధారంగా డబ్బు తరలింపు విషయం తెలిసినట్లు పోలీసులు చెబుతున్నారని.. నా ఫోన్‌ను తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేసిందా? అని ప్రశ్నించారు. ఈ అంశంపై కేంద్రహోంశాఖకు ఫిర్యాదు చేశానని వెల్లడించారు.

  దుబ్బాకలో ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. టీఆర్ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి సోలిపేట సుజాత పోటీచేస్తున్నారు. బీజేపీ నుంచి రఘునందన్ రావును ఆ పార్టీ ఖరారు చేసింది. కాంగ్రెస్‌ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి పేరు ఖరారయినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్‌కు పార్టీకి గుడ్ బై చెప్పిన ఆయన మంగళవారం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి పేరును ఇవాళ కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటిస్తుంచవచ్చు. ఇక స్వతంత్ర అభ్యర్థిగా బిగ్ బాస్ ఫేమ్ కత్తి కార్తీక బరిలో ఉన్నారు.

  దుబ్బాక ఉపఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే. నవంబరు 3న పోలింగ్ నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. నవంబరు 10న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. దుబ్బాక ఉపఎన్నికకు సంబంధించి ఈ నెల 9న నోటిఫికేషన్ జారీ చేస్తారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబరు 16. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబరు 19 వరకు గడువు ఉంటుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. పార్టీల ప్రచారం కూడా ఊపందుకుంది. గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు.


  2018 డిసెంబర్‌లో జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి విజయం సాధించారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దుల నాగేశ్వరరెడ్డి పోటీ చేశారు. రామలింగారెడ్డికి 89,299 ఓట్లు వచ్చాయి. నాగేశ్వరరెడ్డికి 26,799 ఓట్లు వచ్చాయి. 62,500 ఓట్ల తేడాతో రామలింగారెడ్డి విజయం సాధించారు. అయితే, కొన్ని రోజుల క్రితం రామలింగారెడ్డి హఠాన్మరణం చెందారు. దీంతో దుబ్బాకలో ఉప ఎన్నిక వచ్చింది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పడంతో పోలింగ్ అనివార్యం అయింది.
  Published by:Shiva Kumar Addula
  First published: