Dubbaka ByPoll: టీఆర్ఎస్ అలా చేసి దుబ్బాకలో గెలవాలనుకుంటోంది.. డీకే అరుణ సంచలన ఆరోపణలు

డీకే అరుణ(ఫైల్ ఫొటో)

దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి పాలు కాబోతోందని మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ జోస్యం చెప్పారు. ఈ విషయం సర్వేల్లో తేలడంతోనే ఆ పార్టీ అరచకాలు చేసి గెలవాలనుకుంటోందని ధ్వజమెత్తారు.

 • Share this:
  దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి పాలు కాబోతోందని మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ జోస్యం చెప్పారు. ఈ విషయం సర్వేల్లో తేలడంతోనే ఆ పార్టీ అరచకాలు చేసి గెలవాలనుకుంటోందని ధ్వజమెత్తారు. నిరసన దీక్షలో ఉన్న బండి సంజయ్ ను ఆమె ఈ రోజు పరామర్శించారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ.. పోలీసులను అడ్డుపెట్టుకుని టీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ లేని సిద్దిపేటలో బీజేపీ అభ్యర్థుల బంధువుల ఇళ్లలో అప్రజాస్వామికంగా సోదాలు చేశారన్నారు. దుబ్బాకలో బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామన్నారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ సొంత సీటును కాపాడుకునేందుకు దురాగతాలు చేస్తోందని ధ్వజమెత్తారు. అక్కడ ప్రజలు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. ఓటు వేయకపోతే
  సంక్షేమ పథకాలు ఇవ్వబోమని దుబ్బాక ప్రజలను బెదిరిస్తున్నారని ఆరోపించారు.

  ఓడిపోతామని తెలిసి సీఎం మైండ్ గేమ్ ఆడుతున్నాడన్నారు. దుబ్బాక ఫలితం రానున్న 2023 ఎన్నికల ఫలితాలకు అద్దం పట్టబోతోందన్నారు. ఎందుకోసం తెలంగాణ కోరుకున్నామో అవేవీ నెరవేరలేదన్నారు. టీఆర్ఎస్ నియంతృత్వ పోకడను ప్రజలు అర్థం చేసుకున్నారని అరుణ అన్నారు. దుబ్బాకలో కనీస అభివృద్ధి ఎందుకు చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రం నుంచి డబ్బులు రాలేదని, వ్యవసాయ మీటర్లు పెడుతారని హరీశ్ అబద్దాలు చెబుతున్నాడని మండిపడ్డారు. కేంద్ర నిధులు రాలేదని అర్థిక మంత్రి రాతపూర్వకంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కంటే హరీష్ ఎక్కువ అబద్ధాలు చెబుతున్నాడన్నారు. అబద్దాల్లో వీళ్లకు డాక్టరేట్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు.

  సీటు పోతే పరువుపోయి ప్రభుత్వం కూలిపోతుందనే భయంతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపణలు గుప్పించారు. నిన్న బండి సంజయ్ పై దాడి సహించలేనిదన్నారు. సిద్ధిపేట సీపీని సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలంటే ఇప్పుడున్న అధికారులందరినీ మార్చాలన్నారు. బీజేపీ శ్రేణులంతా దుబ్బాక కార్యక్షేత్రంలో ఉండాలని అరుణ పిలుపునిచ్చారు. ఆరు ఏళ్లలో దుబ్బాక కోసం జరగని అభివృద్ధి ఇప్పుడెలా చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అరెస్టు చేసిన బీజేపీ నేతలను, కార్యకర్తలందరినీ బేషరతుగా విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
  Published by:Nikhil Kumar S
  First published: