హోమ్ /వార్తలు /రాజకీయం /

Dubbaka Bypolls: దుబ్బాక టీఆర్ఎస్ టికెట్ కోసం ఆ నేత విశ్వ ప్రయత్నాలు

Dubbaka Bypolls: దుబ్బాక టీఆర్ఎస్ టికెట్ కోసం ఆ నేత విశ్వ ప్రయత్నాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దుబ్బాకలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ పోటీ చేస్తామని ప్రకటించింది. బీజేపీ నుంచి రఘునందన్ రావు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.

  దుబ్బాక ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ టికెట్‌ను సాధించేందుకు చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను, అలాగే తండ్రి చెరుకు ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. శ్రీనివాసరెడ్డికి టీఆర్ఎస్ టికెట్ దక్కకపోతే దుబ్బాక నియోజక వర్గంలో అధికార పార్టీలో రెండు వర్గాలుగా విడిపోయే అవకాశం కనబడుతున్నాయి. అధికార పార్టీలో రెండు వర్గాల మధ్య ప్రచారం జోరుగా ఊపందుకుంది. అభ్యర్థులను ఇంకా ప్రకటించకపోవడంతో ఎవరికి వారే యమునా తీరులా ప్రచారం చేస్తున్నారు. తమకే టికెట్ వస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి శ్రీనివాస్ రెడ్డికి టికెట్ దక్కకపోతే ఆయన సైలెంట్ అయిపోతారని, దాని వల్ల అధికార పార్టీకి మెజార్టీ తగ్గొచ్చనే చర్చ కూడా నియోజకవర్గంలో మొదలైంది.

  2018 ఎన్నికల్లో దుబ్బాక నుంచి గెలుపొందిన రామలింగారెడ్డి హఠాన్మరణంతో అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. అయితే, రామలింగారెడ్డి సతీమణి సుజాతకు టీఆర్ఎస్ పార్టీ టికెట్లు ఇస్తున్నట్లు తెలుస్తుంది. టికెట్ మీద చాలా ఆశలు పెట్టుకున్న చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాసరెడ్డికి నామినేటెడ్ పోస్టు ఇస్తామని బేరసారాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. అయితే, అందుకు ఒప్పుకునేది లేదంటున్నారు చెరుకు శ్రీనివాసరెడ్డి. గతంలో తన తండ్రికి అన్యాయం జరిగిందని, ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని ఆయన తన సహచరుల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.

  చెరుకు శ్రీనివాసరెడ్డి

  చెరుకు ముత్యం రెడ్డి ఆశయాలు కొనసాగిస్తాం: చెరుకు శ్రీనివాస్ రెడ్డి

  దుబ్బాక నియోజక వర్గంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. చెరుకు ముత్యం రెడ్డి చేసిన పనుల వల్ల దుబ్బాక నియోజక వర్గ రైతుల కళ్ళల్లో ఆనందం వెల్లివిరుస్తుందంటున్నారు. కుడవెళ్ళి జలకళ ఒక ఉదాహరణ గా చెప్పారు. ముత్యం రెడ్డి రైతుల పక్షపాతి అని, నియోజకవర్గంలో ఇంకా 100 సంవత్సరాలైనా ముత్యంరెడ్డి ని మరవరని శ్రీనివాసరెడ్డి అంటున్నారు. అంత అభివృద్ది మరెవరి వల్లా సాధ్యం కాలేదని అన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే దుబ్బాక నియోజక వర్గ ఉపఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన అన్నారు.

  దుబ్బాకలో ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 9న నోటిఫికేషన్ జారీ కానుంది. 16వ తేదీ వరకు నామినేషన్లు వేసేందుకు అవకాశం ఉంది. 17వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. 19వ తేదీ వరకు నామినేషన్లను విత్ డ్రా చేసుకోవడానికి వీలుంది. నవంబర్ 3వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. నవంబర్ 10వ తేదీన ఉప ఎన్నిక కౌంటింగ్ జరగనుంది.


  దుబ్బాకలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ పోటీ చేస్తామని ప్రకటించింది. దుబ్బాకలో సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. గట్టి అభ్యర్థిని బరిలో దింపాలని భావిస్తోంది. బీజేపీ నుంచి రఘునందన్ రావు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు యాంకర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ కత్తి కార్తీక కూడా పోటీ చేస్తానని ప్రకటించింది. ఆమె ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని చెప్పింది.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Dubbaka By Elections 2020, Telangana, Trs

  ఉత్తమ కథలు