news18-telugu
Updated: November 19, 2020, 10:57 PM IST
ప్రతీకాత్మక చిత్రం
Do's and Dont's for GHMC Elections: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలను రాష్ట్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది. డిసెంబర్ 1న జరగబోయే ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్థులు పాటించాల్సిన నియమాలను విడుదల చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో గ్రేటర్లో రాజకీయ సందడి మొదలైంది. కరోనా నేపథ్యంలో ప్రచారం విషయంలో ఎన్నికల సంఘం అనేక ఆంక్షలు విధించింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గతంలో మాదిరిగా కాకుండా నిబంధనల మేరకు మాత్రమే ప్రచారం చేపట్టాలని మార్గదర్శకాలను విడుదల చేసింది. రెండు వాహనాలతోనే కాన్వాయ్ ఉండాలని.. భౌతిక దూరం తప్పనిసరి అని పేర్కొంది. రోడ్ షోల్లోనూ కరోనా నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. ఎన్నికల ప్రచారం సమయంలో కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఎన్నికల పరిశీలకులు కేసులు పెట్టనున్నారు.
గోడలమీద రాతలు, పోస్టర్లు/ పేపర్లు అంటించుట, లేక మరే ఇతర విధంగా కానీ ప్రభుత్వ ఆవరణలను (భవనాలు మొదలైన కట్టడాలు) పాడు చేయుట నిషేధం.
పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు వీలైనంత మేరకు ప్లాస్టిక్ పాలిథిన్ తో తయారైన పోస్టర్లు/ బ్యానర్ల వాడకం నివారించేందుకు ప్రయత్నించాలి.
ఎన్నికల కరపత్రం లేక పోస్టరుపై ఆ ప్రింటరు, పబ్లిషరు పేర్లు, అడ్రస్సులు లేకుండా ముంద్రించరాదు. లేక ప్రచురించరాదు.
ప్రత్యేక ఉపకరణాలు ధరించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ వాటికి అయ్యే ఖర్చు మాత్రం అభ్యర్థి ఎన్నికల వ్యయ పట్టికలో నమోదు చేయాలి.
ఎన్నికల పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు నుంచి, అభ్యర్థి తన ఎన్నికల నిమిత్తం ప్రజలకు, సినిమాటోగ్రఫీ, టెలివిజన్ లేదా ఇతర తత్సమాన ప్రచార సాధనాలు వినియోగించుట నిషేధం.
లౌడ్ స్పీకర్లు వాడడానికి సంబంధిత పోలీసు అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతి పొందాలి.బహిరంగ సమావేశాలు రహదారి ప్రదర్శనలలో లౌడ్ స్పీకర్లను ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల మధ్య ఇతర సంందర్భాలలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అనుమతించబడతాయి.
పబ్లిక్ సమావేశాలు రాత్రి 10 గంటల దాటిన తరువాత, ఉదయం 6 గంటల కన్నా ముందు నిర్వహించరాదు. ఎన్నికల పోలింగ్ ముగిసే సమాయానికి 48 గంటల ముందు నుంచి పోలింగ్ ముగిసే వరకు ఎటువంటి పబ్లిక్ సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించరాదు.
అధికారిక యంత్రాంగం ద్వారా ఓటర్లకు అధికారిక ఫోటో గుర్తింపు స్లిప్ జారీ చేయబడుచున్నందున, అభ్యర్థులు అనధికారిక గుర్తింపు స్లిప్స్ ఇవ్వకూడదు.
డిసెంబరు 1న జీహెచ్ఎంసీలో పోలింగ్ జరగనుంది. ఈ సారి మేయర్ పీఠం జనరల్ మహిళకు కేటాయించారు. రేపటితో (నవంబర్ 20) నామినేషన్ల ప్రక్రియ ముగిసిపోతుంది. 21న నామినేషన్లను పరిశీలిస్తారు. 22న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అదే రోజు తుది అభ్యర్థుల జాబితాను, కేటాయించిన గుర్తులను ప్రకటిస్తామన్నారు. డిసెంబర్ 1 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుంది. జీహెచ్ఎంసీలో మొత్తం 150 వార్డులు ఉన్నాయి.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
November 19, 2020, 10:52 PM IST