కే ట్యాక్స్ ఎఫెక్ట్.. త్వరలో కోడెల కుటుంబంలో అరెస్టులు?

Kodela Sivaprasadrao | బాధితులతో సాధ్యమైనన్ని కేసులు పెట్టించిన తర్వాత వాటిపై సిట్ లేదా సీఐడీ విచారణకు ఆదేశించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: June 14, 2019, 7:24 PM IST
కే ట్యాక్స్ ఎఫెక్ట్.. త్వరలో కోడెల కుటుంబంలో అరెస్టులు?
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు
  • Share this:
‘కే ట్యాక్స్’ వ్యవహారంలో ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో పాటు ఆయన కుమారుడు కోడెల శివరామకృష్ణ, కూతురు పూనాటి విజయలక్ష్మి అరెస్టు తప్పేలా లేదు. ఇప్పటికే గత ఐదేళ్లుగా కోడెల కుటుంబం గుంటూరు జిల్లా నరసరావుపేట, సత్తెనపల్లిలో సాగించిన అరాచకాలపై పకడ్బందీగా ఆధారాలు సేకరించిన పోలీసులు.. తదుపరి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు కోడెల కుటుంబం అరాచకాలపై సిట్ లేదా సీబీసీఐడీ విచారణ జరిపించాలని వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి డిమాండ్లు పెరుగుతున్నాయి. స్పీకర్, ఎమ్మెల్యే అధికారాల్ని అడ్డుపెట్టుకుని ఐదేళ్లుగా కోడెల శివప్రసాద రావు, ఆయన కుటుంబ సభ్యులు సాగించిన అరాచకాలపై పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా రోజుకో రకంగా బాధితులు, పోలీసులకు దిశానిర్దేశం చేస్తున్నారు. తొలుత కోడెల తనయుడు శివరామకృష్ణ వ్యవహారంలో కేసు నమోదు చేసిన పోలీసులు... విజయసాయిరెడ్డి ట్వీట్ తర్వాత బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతుండటంతో అవాక్కవుతున్నారు. బాధితులు నిర్భయంగా ముందుకు వచ్చి కోడెల కుటుంబ అరాచకాలపై ఫిర్యాదులు చేయాలని సాయిరెడ్డి కోరగానే పలువురు పోలీసు స్టేషన్లకు క్యూ కట్టారు. దీంతో ఇన్నాళ్లుగా అవే ఫిర్యాదులపై మౌనంగా ఉన్న పోలీసులు... సాయిరెడ్డి దిశానిర్దేశంతో గత వారం రోజుల్లో ఏకంగా కోడెల కుటుంబంపై ఏకంగా పది కేసులు నమోదు చేశారు.గత ప్రభుత్వంలో గుంటూరు జిల్లా సత్తెనపల్లి, నరసరావుపేటలో ఏ పని కావాలన్నా కోడెల పేరుతో కే ట్యాక్స్ కట్టాల్సిందే అంటూ ఇన్నాళ్లుగా బెదిరింపులకు దిగిన కోడెల పుత్ర రత్నాలు.. ప్రభుత్వం మారడంతో కాస్త తగ్గారు. అయినా వైసీపీ నేతల అండతో బాధితులు ఒక్కొక్కరిగా బయటికి వస్తుండటం కోడెలకు చుక్కలు చూపిస్తోంది. దీంతో ఆయన రెండురోజుల క్రితం స్వయంగా మీడియా ముందుకు వచ్చి తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారంటూ ఆవేదన వెళ్లగక్కారు. అయినా బాధితులు మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో పోలీసులు కూడా కే ట్యాక్స్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని వరుస కేసులు నమోదు చేస్తున్నారు. ఇలా బాధితులతో సాధ్యమైనన్ని కేసులు పెట్టించిన తర్వాత వాటిపై సిట్ లేదా సీఐడీ విచారణకు ఆదేశించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ వాదనకు మద్దతుగా గుంటూరు జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి మేకపాటి గౌతంరెడ్డి కూడా కోడెల కుటుంబం అరాచకాలపై చర్యలు తప్పవని సోషల్ మీడియాలో సైతం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కోడెల కుటుంబం బాధితులు వందల్లో ఉన్నందున, వారంతా పోలీసు స్టేషన్లకు వచ్చి ఫిర్యాదు చేసే అవకాశం లేనందువల్ల ప్రభుత్వమే సిట్ లేదా సీఐడీ విచారణకు ఆదేశించడం ద్వారా అరాచకాలను వెలికి తీయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోడెల శివప్రసాదరావుతో పాటు ఆయన తనయుడు శివరామకృష్ణ, తనయ విజయలక్ష్మిలను త్వరలో అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)
First published: June 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading