టీడీపీ నుంచి వైసీపీలో చేరిన నేతకు ఎమ్మెల్సీ పదవి... సీఎం జగన్ నిర్ణయం..

Dokka Manikya Vara Prasad | డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేశారు. రేపు ఆయన నామినేషన్ వేస్తారు.

news18-telugu
Updated: June 24, 2020, 8:57 PM IST
టీడీపీ నుంచి వైసీపీలో చేరిన నేతకు ఎమ్మెల్సీ పదవి... సీఎం జగన్ నిర్ణయం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరిన గుంటూరు జిల్లాకు చెందిన నేత డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేశారు. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న ఆయన తన పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. మళ్లీ డొక్కాకే ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈనెల 25న ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్‌కు చివరి తేదీ. దీంతో రేపు ఆయన నామినేషన్ వేయనున్నారు. డొక్కా మాణిక్యవరప్రసాద్ అభ్యర్థిత్వాన్ని జగన్ ఖరారు చేయడంతో ఆయన నామినేషన్ వేస్తారని వైసీపీ వర్గాలు చెప్పాయి. తెలుగుదేశం పార్టీ హయాంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పోటీచేసి విజయం సాధించారు. ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో డొక్కా మాణిక్యవరప్రసాద్ టీడీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.

డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఈనెల 15న కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 18న నోటిఫికేషన్ వచ్చింది. ఈనెల 25వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయడానికి గడువు. 26వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. ఈనెల 29 వరకు నామినేషన్లు విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంది. జూలై 6వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు ఎన్నికలు నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్లను లెక్కిస్తారు. ఆ పదవికి ఎంపికయ్యే వారు 2023 మార్చి 29 వరకు ఎమ్మెల్సీగా కొనసాగుతారు.

ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. వైసీపీ తరఫున పోటీ చేసిన నలుగురు అభ్యర్థులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ విజయం సాధించారు. టీడీపీ తరఫున పోటీ చేసిన వర్ల రామయ్య పరాజయం చెందారు. వైసీపీకి చెందిన 151 మంది ఓటు వేశారు. జనసేన అభ్యర్థి కూడా వైసీపీకి ఓటేశారు. టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉండగా, 21 ఓట్లు వచ్చాయి. అందులో నాలుగు ఓట్లు చెల్లలేదు. ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరితోపాటు ఆదిరెడ్డి భవానీ ఓటు కూడా చెల్లలేదు.
First published: June 24, 2020, 8:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading