హోదా అడగొద్దు... జగన్‌కు పురంధేశ్వరి సూచన

ఏపీ సీఎం జగన్(File)

వైసీపీ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం కల్పించలేకపోయిందని బీజేపీ నేత పురంధేశ్వరి ఆరోపించారు. ఇసుక పాలసీపై ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించకపోవడం వల్ల నిర్మాణ రంగం కుదేలైందన్నారు.

  • Share this:
    బీజేపీ నాయకురాలు, కేంద్ర మాజీమంత్రి పురంధేశ్వరి మరోసారి వైసీపీపై విమర్శలు గుప్పించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్రం స్పష్టంగా చెప్పినా.. ఈ విషయాన్ని ఏపీలోని అధికార వైసీపీ మళ్లీ మళ్లీ డిమాండ్ చేయడాన్ని పురంధేశ్వరి తప్పుబట్టారు. ఏపీ సహా ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారని గుర్తు చేశారు. అయినా సీఎం జగన్మోహన్ రెడ్డి తరచూ హోదా గురించి మాట్లాడటం సమంజనం కాదని సూచించారు. విభజన చట్టంలోని అంశాలను 90 శాతం కేంద్రం అమలు చేసిందని పురంధేశ్వరి వ్యాఖ్యానించారు.

    వైసీపీ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం కల్పించలేకపోయిందని ఆమె ఆరోపించారు. ఇసుక పాలసీపై ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించకపోవడం వల్ల నిర్మాణ రంగం కుదేలైందన్నారు. కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పురంధేశ్వరి అన్నారు. గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించే విషయంలో ఏపీ సీఎం జగన్ కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చిస్తే సరిపోదని... ఈ విషయంలో తరలించే రాష్ట్ర ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆమె సూచించారు. దుగ్గరాజుపట్నం పోర్టుకు ప్రత్యామ్నాయంగా రామయపట్నం పోర్టును ప్రతిపాదించాలని పురంధేశ్వరి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఇందుకు కేంద్రం కూడా సుముఖంగా ఉందన్నారు. టీడీపీ అవినీతిని గ్రహించిన ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పారని పురంధేశ్వరి వ్యాఖ్యానించారు.
    First published: