news18-telugu
Updated: March 11, 2020, 6:33 PM IST
డీకే శివకుమార్(ఫైల్ ఫోటో)
DK Shiva Kumar | కర్ణాటక రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్‌ను కాంగ్రెస్ పార్టీ నియమించింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు డీకే శివకుమార్‌కు అప్పగిస్తారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం డీకే శివకుమార్‌కు పగ్గాలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ప్రెసిడెంట్ గుండూరావు నుంచి డీకే శివకుమార్ బాధ్యతలు చేపడతారు. అలాగే, వర్కింగ్ ప్రెసిడెంట్స్‌గా ఈశ్వర్ ఖండ్రే, సతీష్ జార్ఖిహోలీ, సలీమ్ అహమద్‌లను నియమిస్తూ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఆదేశాలు జారీ చేశారు. వీరితోపాటు కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో చీఫ్ విప్‌లను కూడా మారుస్తూ ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. అజయ్ సింగ్ (అసెంబ్లీలో చీఫ్ విప్), నారాయణ స్వామి (శాసనమండలిలో చీఫ్ విప్) గా నియమించారు. కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యకు ప్రస్తుతం ఉన్న సీఎల్పీ నేత పదవి, ప్రతిపక్ష నేత హోదాను కొనసాగించారు.

కేపీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ నియామకం
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా చేయడంతో అక్కడ కమల్ నాథ్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. సింధియా వర్గానికి చెందిన వారిలో ఇప్పటి వరకు 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అందులో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారు. దీంతో కమల్ నాథ్ ప్రభుత్వం కూలడానికి సిద్ధంగా ఉందని భావిస్తున్నారు. మధ్యప్రదేశ్ ప్రభావం కర్ణాటకలో పడనుందనే రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా వలవేస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ క్రమంలో ట్రబుల్ షూటర్‌గా పేరుపొందిన డీకే శివకుమార్‌కు కర్ణాటక కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించింది.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
March 11, 2020, 3:29 PM IST