జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇప్పటికీ రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. కాశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వం వహించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ ప్రకటించగా.. తమకు ఆ అవసరం ఏమీ లేదని స్పష్టం చేసింది భారత్. ఇప్పటికే అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబడ్డ పాకిస్తాన్.. తనను తాను కప్పిపుచ్చుకునేందుకు నానాతంటాలు పడుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఆయనకు, కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగించేలా మారాయి. కాశ్మీర్ అంశంలో మోదీ సర్కారును విమర్శించే సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలను పాకిస్తాన్ వాడుకుంది. ఐక్యరాజ్యసమితికి రాసిన లేఖలో ‘కాశ్మీర్లో జరుగుతున్న హింసపై కీలక నేతలు కూడా ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా.. జమ్మూ కాశ్మీర్లో ప్రజలు చచ్చపోతున్నారు. అక్కడ అంతా తప్పుగా జరుగుతోంది’ అని అన్నారంటూ పాకిస్తాన్ పేర్కొంది.
దీంతో రాహుల్ వ్యాఖ్యలను పాకిస్తాన్ వక్రీకరించిందని కాంగ్రెస్ పేర్కొంటుండగా.. కశ్మీర్ భారత్‌కు చెందిన అంతర్గత వ్యవహారం అంటూ రాహుల్ కూడా తప్పును సరిదిద్దుకునేలా వ్యవహరిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా.. ‘జమ్మూ కాశ్మీర్లో హింస కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్త ఉగ్రవాదానికి ప్రధాన మద్దతుదారుగా ఉన్న పాకిస్తాన్ వల్లే అక్కడ హింస ప్రేరేపితమవుతోంది’ అని ఒక ట్వీట్.. ‘అనేక విషయాల్లో కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలితో నేను ఏకీభవించను. కానీ, కాశ్మీర్ పూర్తిగా భారత్ అంతర్గత విషయం. పాకిస్తాన్ కానీ మరే ఇతర దేశానికి కానీ ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి ఒప్పుకోం’ అని మరో ట్వీట్ చేశారు రాహుల్. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా మీడియా సమావేశం నిర్వహించి క్లారిటీ ఇచ్చారు. పాకిస్తాన్ రాహుల్ వ్యాఖ్యలను వక్రీకరించింది అంటూ స్పష్టం చేశారు.
Published by:Shravan Kumar Bommakanti
First published:August 28, 2019, 13:13 IST