ఏపీలోని అధికార పార్టీ వైసీపీలో నేతల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. చిలకలూరి పట్టణంలోని పురుషోత్తపట్నంలో మహాశివరాత్రి సందర్భంగా బైరా సంఘమిత్ర వారు ఏర్పాటు చేసిన ప్రభ వద్దకు ఎంపీ లావు కృష్ణదేవరాయలు చేరుకున్నారు. అయితే అక్కడికి వచ్చిన ఎంపీ కృష్ణదేవరాయులను ఎమ్మెల్యే విడదల రజినీ వర్గీయులు అడ్డగించారు.ఈ సంఘటనతో ఇరువర్గాల మధ్య తోపులాట, ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఒక వ్యక్తికి తలకు గాయాలయ్యాయి.
పోలీసులు ఎంత సర్దిచెప్పినా ఇరువర్గాలు వినలేదు. గంటన్నరపాటు ఉద్రిక్తతలు కొనసాగాయి. దీంతో పోలీసులు అతి కష్టంమీద ఎంపీ కారు, కాన్వాయ్‌ను అక్కడి నుంచి పంపించేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారం వెనుక అసలు కారణం వేరే ఉందని తెలుస్తోంది. తనకు వ్యతిరేకంగా మర్రి రాజశేఖర్‌ను ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే రజినీ కొంతకాలంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగానే ఎంపీ, ఎమ్మెల్యే మధ్య గ్యాప్ బాగా పెరిగిందనే ప్రచారం సాగుతోంది.
గత ఎన్నికల్లో మర్రి రాజశేఖర్‌ను బుజ్జగించి... చిలకలూరిపేట ఎమ్మెల్యే సీటును విడదల రజినీకి ఇచ్చిన సీఎం జగన్... మర్రి రాజశేఖర్‌ను ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇస్తానని అప్పట్లో హామీ ఇచ్చారు. తాజాగా మండలి రద్దు వార్తల నేపథ్యంలో మర్రి రాజశేఖర్ వైసీపీ తరపున రాజ్యసభ రేసులో ఉన్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
Published by:Kishore Akkaladevi
First published:February 20, 2020, 11:48 IST