ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి కార్గో విమానంలో రహస్యంగా ప్రయాణించారా? ఆయన ఢిల్లీ నుంచి కోల్ కతా వెళ్లారా? ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం విచారణను ప్రారంభించింది. పశ్చిమ బెంగాల్లో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల విషయంలో రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో కేంద్రానికి కౌంటర్ ఇచ్చేందుకు తనకు సాయం చేయాలంటూ మమతా బెనర్జీ కోరడంతో టీఎంసీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్న ప్రశాంత్ కిశోర్ ఢిల్లీ నుంచి కోల్ కతా వెళ్లారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఓ బీజేపీ నేత సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ నుంచి సరుకులను తీసుకుని వెళ్లే కార్గో విమానంలో ఆయన కోల్ కతా వెళ్లారని ఆరోపించారు. ఢిల్లీ, కోల్ కతా విమానాశ్రయాల్లో ప్రశాంత్ కిశోర్ ఉన్నారా? లాక్ డౌన్ సమయంలో ఆయనకు సంబంధించిన ఏమైనా ఆధారాలు ఉన్నాయేమోనని కేంద్రం విచారణ జరుపుతోంది. అయితే, తాను మార్చి 19 తర్వాత ఎక్కడికీ వెళ్లలేదని ప్రశాంత్ కిశోర్ చెబుతున్నారు. ఒకవేళ తాను అలా ప్రయాణం చేసినట్టు వివరాలు ఉంటే ప్రజల ముందు ఉంచాలని స్పష్టం చేశారు.