కేంద్ర హోంమంత్రి, బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఫోన్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో శాసనమండలిని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రద్దు చేస్తారంటూ బలంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు అమిత్ షాకు ఫోన్ చేశారని, మండలి రద్దు ప్రతిపాదన కేంద్రం వద్దకు వస్తే దాన్ని ఆపాలని కోరినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే, తాను ఒక సంవత్సరం వరకు ఆపుతానంటూ అమిత్ షా చెప్పారని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నట్టు వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అయితే, అసలు అమిత్ షా ఎందుకు మాట్లాడతారని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.
శాసనమండలిలో ప్రస్తుతం టీడీపీకి చెందిన మెజారిటీ సభ్యులు ఉన్నారు. దీంతో ఇప్పటికే నాలుగు కీలక బిల్లుల విషయంలో వైసీపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఇంగ్లీష్ మీడియం బిల్లుతో పాటు మరో బిల్లును శాసనమండలి ఓడించింది. దీంతో మరోసారి శాసనసభలో ఆ రెండు బిల్లులను ప్రవేశపెట్టి వాటిని గట్టెక్కించింది జగన్ ప్రభుత్వం. ఇక మూడు రాజధానులకు సంబంధించిన అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనమండలి చైర్మన్ సెలక్ట్ కమిటీకి పంపడంతో కౌన్సిల్ రద్దు ఖాయమని బలంగా ప్రచారం జరుగుతోంది.
శాసనమండలిలో ప్రస్తుతం టీడీపీకి మెజారిటీ ఉన్నా, 2021 జూన్ నాటికి వైసీపీకి మెజారిటీ దక్కే అవకాశం ఉంది. 15 నెలల పాటు జగన్ వెయిట్ చేస్తే.. ఆ తర్వాత రెండు సభల్లోనూ జగన్కు తిరుగుండదు. అయితే, అప్పటి వరకు శాసనమండలిలో టీడీపీ అడ్డుపడుతూనే ఉంటుందనే వాదన మరికొందరు వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:January 26, 2020, 18:51 IST