ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రతిపక్షాలను ఉద్దేశించిన ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో ముఖ్యంగా బీజేపీలో చర్యనీయాంశంగా మారాయి. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. ‘ప్రజల కోసం ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేపడుతున్నాయం. అయినా మన మీద అపనిందలు వేస్తున్నారు. ప్రజల్ని మభ్యపెడుతున్నారు. దుష్ప్రచారం చేస్తున్నారు. ఎంతమంది శత్రువులు ఏకమైనా ఎదుర్కొంటా. ఎన్ని అపనిందలు వేసినా తట్టుకుని నిలబడతా. దానికి దేవుడి దయ. మీ చల్లని దీవెనలు ఉంటే చాలు.’ అని అన్నారు.
అయితే, ఎంతమంది శత్రువులు ఎదురైనా అని జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకంగా నొక్కి చెప్పడం వెనుక ఉద్దేశం ఏంటనే చర్చ మొదలైంది. ఏపీలో ప్రతిపక్ష టీడీపీ, జనసేన మాత్రమే ప్రధానంగా జగన్ మోహన్ రెడ్డిని మొన్నటి వరకు టార్గెట్ చేశాయి. అయితే, ఇటీవల బీజేపీ కూడా జగన్ టార్గెట్గా రాజకీయాలు చేస్తోంది. తన విమర్శలకు పదునుకూడా పెంచుతోంది. ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రోత్సహించడం వెనుక మత మార్పిడుల కుట్ర ఉందంటూ అసలు వివాదానికి బీజం వేసింది బీజేపీనే. ఈ లెక్కలన బీజేపీ, టీడీపీ, జనసేన అన్నీ కలసి తమ ప్రభుత్వం మీద దాడి చేస్తున్నాయని జగన్ మోహన్ రెడ్డి చెప్పకనే చెప్పారు.
గతంలో చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఎన్నికలకు ముందు బీజేపీ, వైసీపీ, జనసేన తనను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నాయని.. ప్రజలే అండగా ఉండాలని కోరారు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కూడా ఎంతమంది శత్రువులు ఏకమై వచ్చినా ఎదుర్కొంటా అని చెప్పడంలో ఉద్దేశం కూడా అదేననే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తం అవుతోంది.
బీజేపీకి దగ్గర కావాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఆ తర్వాత జాతీయ మీడియాలో జగన్ మీద కూడా విమర్శల దాడి కొనసాగుతోంది. ఈ క్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేనను టార్గెట్ చేయడానికి జగన్ సిద్ధమయ్యారని.. ఆ క్రమంలోనే ప్రజలను కూడా సిద్ధం చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.